‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌పై సాగిన వివాదానికి తెరపడింది. ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ సమీర్ వాంఖెడే దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గురువారం (2026 జనవరి 29) నాడు ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, సమీర్ వాంఖెడే దాఖలు చేసిన దావాను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో సిరీస్ నిర్మాతలు షారుఖ్ ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో పాటు దర్శకుడు ఆర్యన్ ఖాన్కు ఊరట లభించింది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో..
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సమయంలో దర్యాప్తు అధికారిగా సమీర్ వాంఖెడే పేరు దేశవ్యాప్తంగా ప్రముఖంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌కు తర్వాత క్లీన్ చిట్ లభించింది. అదే సమయంలో, షారుఖ్ ఖాన్ నుంచి రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో వాంఖెడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌లో తనను పోలిన పాత్రను సృష్టించడం ద్వారా ఆర్యన్ ఖాన్ కుటుంబం పాత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ సమీర్ వాంఖెడే కోర్టును ఆశ్రయించారు. అయితే, తాజా తీర్పుతో ఆ దావాకు కోర్టు ముగింపు పలికింది.
‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో ఆర్యన్ ఖాన్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాలీవుడ్‌లోని వారసత్వ రాజకీయాలు (నెపోటిజం), లీకైన వీడియోలు, ఇండస్ట్రీలోని కుట్రలు వంటి అంశాలను వ్యంగ్యంగా ఈ సిరీస్‌లో చూపించారు. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం. గతేడాది సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ అనేక వివాదాలకు కేంద్రబిందువైంది.
ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలపై గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా స్పందించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టాన్ని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఉల్లంఘించారన్న అంశంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
