ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ ఆసక్తికర రిపోర్టును బయటపెట్టింది. భారత్, పాక్ సంబంధాలు ఇప్పటికీ అణు యుద్ద ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది. భారత్,పాకిస్తాన్ లు నేరుగా యుద్ధం చేయడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ, ఉగ్రవాద శక్తులు సంక్షోభాలకు ఆజ్యం పోసే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని యూఎస్ సెనేట్ కు సమర్పించిన ఆన్యువల్ థ్రీట్ అసెస్ మెంట్ రిపోర్టులో వెల్లడించింది.
అమెరికా నిఘా వర్గాలు బుధవారం(మార్చి19) యూఎస్ సెనేట్‌కు సమర్పించిన ఆన్యువల్ థ్రీట్ అసెస్ మెంట్ రిపోర్టు ప్రకారం.. భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఇప్పటికీ అణు యుద్ధ ప్రమాదంలోనే ఉన్నాయి. ఆ 34 పేజీల నివేదికలోనిభారత్ పాక్ మధ్య సంబంధాలపై క్లియర్ కట్ డిటెయిల్స్ ఇచ్చింది. భారత్ ,పాకిస్థాన్‌లు నేరుగా యుద్ధానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ, ఉగ్రవాద శక్తులు సంక్షోభాలకు ఆజ్యం పోస్తున్నాయి. గతంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన ఘర్షణలు అణు యుద్ధ ప్రమాద స్థాయిలోనే ఉన్నాయని, ఇది ఉద్రిక్తతలు పెరగడానికి దారితీస్తుందని రిపోర్టు పేర్కొంది. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిని ఉదాహరణగా చూపుతూ, ఇటువంటి దాడులు దేశాల మధ్య పెద్ద యుద్ధానికి ఎలా దారితీస్తాయో హెచ్చరించింది.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ప్రాంతాలలో పనిచేసే ఇస్లామిక్ స్టేట్ ప్రమాదకరమైన ఉగ్రవాద విభాగం అయిన ISIS-K ఇస్లామిక్ స్టేట్ - ఖొరాసాన్ ప్రావిన్స్ దక్షిణాసియాలో ఇంకా పట్టు కలిగి ఉందని, బయట దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశంతో ఉందని తెలిపింది. అయితే తాలిబాన్ తన భద్రతా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ గ్రూపుపై కఠిన చర్యలు తీసుకుంటోందని నివేదిక పేర్కొంది. తాలిబాన్ దళాలు ISIS-K స్థావరాలపై దాడులు నిర్వహించి, కొన్ని దాడులను అడ్డుకున్నాయని, దీనివల్ల కొంతమంది ISIS-K నేతలు పొరుగు దేశాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడిందని నివేదిక వివరించింది.
