హైదరాబాద్ బిర్యానీకే కాదు.. దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు: సీఎం రేవంత్

హైదరాబాద్ బిర్యానీకే కాదు..  దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు:  సీఎం రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్ బిర్యానీకే కాదు.. దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో మా ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇండియన్ సినిమా హైదరాబాద్ కేంద్రంగా పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం (మార్చి 19) హైటెక్స్‎లో ఎఫ్డీసీ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా యుద్ధ నౌక అని.. ఆయన పిలుపుతో లక్షలాది మంది కదిలేవారని అన్నారు. 

గద్దర్ తన గళంతో అనేక ఉద్యమాలకు ఊపిరిపోశారన్నారు. గద్దర్ పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. సినీ పరిశ్రమకు గుర్తింపునివ్వాలని భావించామన్నారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించేందుకు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ పరిశ్రమకు దాసరి నారాయణ రావు పెద్దగా వ్యవహరించారని పేర్కొన్నారు. సినీకార్మిక పక్షపాతిగా నటుడు ప్రభాకర్ గొప్ప పనులు చేశారని కొనియాడారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‎లోనే వేళ్లూనుకునేందుకు రామోజీరావు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. 

హైదరాబాద్‎లోని హైటెక్స్‎లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, నటులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విశ్వ నటుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున దంపతులు, రాం చరణ్, ఖుష్బూ, అక్కినేని నాగచైతన్య దంపతులు, అల్లు అరవింద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చేసిన డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. అదే విధంగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, రాక్ స్టార్ దేవి ప్రసాద్, ఫోక్ సింగర్ మంగ్లీ తమ గళంతో అలరించారు.