హైదరాబాద్: హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు కేంద్రంగా మార్చాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గురువారం (మార్చి 19) హైటెక్స్‌లో జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడూ కలిసిన సినిమా రంగం అభివృద్ధి గురించే మాట్లాడుతారని చెప్పారు. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారని తెలిపారు. సినిమా అవార్డులు కొన్నాళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యానన్నారు. నటులకు అవార్డులు, పురస్కారాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని.. అవార్డుల ప్రాముఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు.
సినిమా అవార్డులను పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కళాకారులను ప్రోత్సాహించడంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొంత వెనుకంజలో ఉందని అన్నారు. జీడీపీ పెరగటానికి కూడా చిత్ర పరిశ్రమ ఎంతో దోహదం చేస్తోందని చెప్పారు.
►ALSO READ | రష్మిక మా ఊరి కోడలు: గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, నటులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విశ్వ నటుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున దంపతులు, రాం చరణ్, ఖుష్బూ, అక్కినేని నాగచైతన్య దంపతులు, అల్లు అరవింద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చేసిన డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. అదే విధంగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, రాక్ స్టార్ దేవి ప్రసాద్, ఫోక్ సింగర్ మంగ్లీ తమ గళంతో అలరించారు.
