దుబాయ్‌లో ఆర్థిక విప్లవం మొదలైంది. ఇకపై మీ కారు ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కేవలం నగదు రూపంలోనే కాకుండా, బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల ద్వారా కూడా చెల్లించవచ్చు. అవును యూఏఈ ప్రజలకు దుబాయ్ ఇన్సూరెన్స్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇకపై బ్యాంక్ ట్రాన్స్ ఫర్ లేదా చెక్కుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం బిట్‌కాయిన్ సహా ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీల ద్వారా నేరుగా ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒక ఇన్సూరెన్స్ సంస్థ డిజిటల్ అసెట్స్‌ను పేమెంట్స్ కోసం అంగీకరించటం ఇదే తొలిసారి.
క్రిప్టో చెల్లింపులు ఎలా జరుగుతాయి?
ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకమైన డిజిటల్ వాలెట్లను రూపొందించాయి. ఇవి నేరుగా క్రిప్టో పోర్ట్‌ఫోలియోతో అనుసంధానమై ఉంటాయి. మీరు ట్రేడింగ్ కోసం ఉపయోగించే బిట్‌కాయిన్‌తోనే ఇల్లు, కారు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల చెల్లింపులకు వాడొచ్చు. ఇప్పటికే ఎమిరేట్స్ NBD వంటి బ్యాంకులు తమ 'Liv' యాప్ ద్వారా క్రిప్టో ట్రేడింగ్‌ను అనుమతిస్తుండగా.. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగం కూడా అదే బాటలో పయనిస్తోంది.
యూఏఈ ప్రభుత్వం క్రిప్టో లావాదేవీల కోసం అత్యంత సురక్షితమైన చట్టాలను రూపొందించింది. వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ, అబుదాబి గ్లోబల్ మార్కెట్ వంటి సంస్థలు ఈ లావాదేవీలను పర్యవేక్షిస్తాయి. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం ఈ చట్టాల ప్రధాన ఉద్దేశ్యం.
క్రిప్టోలతో చెల్లిస్తే లాభాలేంటి..?
మామూలుగా డబ్బు చెల్లించటానికి క్రిప్టోలను వాడి పేమెంట్స్ చేయటానికి మధ్య ఉన్న ప్రయోజనాల గురించి గమనిస్తే.. క్రిప్టో పేమెంట్స్ వల్ల ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా చెల్లింపులు జరుగుతాయి. దీంతో అదనపు బ్యాంక్ ఫీజులు, ఛార్జీల నుంచి కస్టమర్లకు విముక్తి కలగనుంది. అలాగే రోజులో 24 గంటలూ ఏడాది పొడవునా క్రిప్టో పేమెంట్స్ నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ చేసి వెంటనే పాలసీ సర్టిఫికేట్ పొందవచ్చు.
భవిష్యత్తులో స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ కూడా ఆటోమేటిక్‌గా.. అంటే మీ విమానం ఆలస్యమైతే ఆ నష్టపరిహారం నేరుగా మీ వాలెట్‌కు వచ్చేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం క్రిప్టోకరెన్సీని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఉపయోగించే ఒక కరెన్సీగా మార్చేసింది. భవిష్యత్తులో ఇండియా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పేమెంట్ ఫెసిలిటీ వచ్చే అవకాశాలకు ఇది పునాదిగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే క్రిప్టోల స్వీకరణలో భారత్ అగ్రస్థానంలో ఉన్నందున ప్రభుత్వాలు కొద్దిగా దృష్టి పెడితే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
