అజిత్ పవార్ ఆస్తుల చిట్టా: రూ.124 కోట్ల సామ్రాజ్యం.. బారామతి 'దాదా' సంపద వివరాలివే..

 అజిత్ పవార్ ఆస్తుల చిట్టా: రూ.124 కోట్ల సామ్రాజ్యం.. బారామతి 'దాదా' సంపద వివరాలివే..

మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన అజిత్ పవార్, తన రాజకీయ ప్రస్థానంతో పాటు ఆర్థికంగానూ బలమైన పునాదులు వేసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. అజిత్ పవార్ ఆయన భార్య సునేత్రా పవార్‌ల ఉమ్మడి ఆస్తుల విలువ సుమారు రూ.124 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులతో పాటు వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయి.

అజిత్ పవార్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ.45.37 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.37 కోట్ల విలువైన భూములు, ఇళ్లు ఉన్నాయి. ఆయనకు విలాసవంతమైన టయోటా కామ్రీ, హోండా CR-V కార్లతో పాటు వ్యవసాయానికి అవసరమైన ఒక ట్రాక్టర్ ఉంది. ఇక క్యాష్ విషయానికి వస్తే.. ఆయన చేతిలో రూ.14.12 లక్షలు ఉండగా, వివిధ బ్యాంక్ ఖాతాల్లో రూ.6.81 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ. కోటి విలువైన ఎల్‌ఐసీ పాలసీ కూడా ఆయన పేరున ఉంది.

రాజ్యసభ సభ్యురాలైన సునేత్రా పవార్‌కు అజిత్ పవార్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆమె పేరిట సుమారు రూ.14.57 కోట్ల చరాస్తులు.. రూ.58.39 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకు కూడా రూ.44 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. పవార్ కుటుంబానికి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విలువైన వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అజిత్ పవార్ సంపదకు మూలం ఆయన పుట్టిన బారామతి గడ్డ, సహకార రంగం. 1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. పూణే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా 16 ఏళ్ల పాటు కొనసాగింది. నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన పవార్.. రాష్ట్ర బడ్జెట్‌ను ఐదుసార్లు ప్రవేశపెట్టడం విశేషం. ఎన్ని ఆరోపణలు వచ్చినా, తన రాజకీయ చాణక్యంతో వాటన్నింటినీ దాటుకుంటూ నిరంతరం అధికారంలో భాగస్వామిగా ఉంటూ వచ్చారు. అజిత్ పవార్ అకాల మరణంతో తన భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్‌లకు రాజకీయ, ఆర్థిక వారసత్వాన్ని వదిలి వెళ్లారు.