ICC Player of the Month: వరల్డ్ కప్ గెలిచిన భారత్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ లిస్టులో లేని ఇండియన్ ప్లేయర్స్ 

ICC Player of the Month: వరల్డ్ కప్ గెలిచిన భారత్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ లిస్టులో లేని ఇండియన్ ప్లేయర్స్ 

ICC Player of the Month: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఫిబ్రవరి 2026 నెలకు గాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం నామినీల జాబితాను విడుదల చేసింది. ఆసక్తికరంగా ఈ జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్‌లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో అనేక దేశాలకు చెందిన ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. టీమిండియా ట్రోఫీని గెలుచుకున్నప్పటికీ, జట్టులోని కొంతమంది ఆటగాళ్లు కీలకంగా రాణించినప్పటికీ వారిలో ఎవ్వరూ కూడా ఈ నెల అవార్డు నామినేషన్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.

ముందంజలో ఫర్హాన్:
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీలలో ప్రధానంగా పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ పేరు ఉంది. ఈ టోర్నమెంట్‌లో అతను అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో.. టోర్నీలో మొత్తం 383 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. నమీబియా, శ్రీలంకపై రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అతని ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టు సూపర్ –8 దశ వరకు చేరింది, కానీ సెమీఫైనల్‌ని తృటిలో కోల్పోయింది. 

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విల్ జాక్స్: 
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టోర్నమెంట్‌లో బ్యాట్, బాల్ రెండింటితోనూ అతను కీలక పాత్ర పోషించాడు. సుమారు 200 పరుగులు చేయడంతో పాటు తన  బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. అతని ప్రదర్శనలు చాలా మ్యాచ్‌లలో జట్టుకి విజయం తెచ్చి పెట్టాయి. మొత్తం నాలుగు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచి ఒకే ఎడిషన్‌లో నాలుగు అవార్డులు గెలిచిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 

బౌలింగ్ లో వాన్ స్కాల్క్విక్ ప్రభావం: 
అమెరికా పేసర్ షాడ్లీ వాన్ స్కాల్క్విక్ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల నామినీలో చోటు దక్కించుకున్నాడు. టోర్నమెంట్‌లో అతను 13 వికెట్లు తీసి యూఎస్ఏ జట్టుకు కీలక బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభంలోనే భారత్‌పై 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టాడు. వికెట్లతో పాటు అతని ఎకానమీ రేట్ కూడా చాలా నియంత్రణలో ఉండటం విశేషం.

టైటిల్ భారత్‌దే.. షార్ట్‌లిస్ట్‌లో లభించని స్థానం: 
భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంలో సంజూ సాంసన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ చివరి దశల్లో అతను అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే సంజు కీలకమైన ప్రదర్శన మొత్తం.. మార్చి నెల ప్రారంభంలో జరిగాయి.. చివరి మూడు మ్యాచ్‌లలో మాత్రమే శాంసన్ రావడంతో ఫిబ్రవరి నెల అవార్డు నామినేషన్లలో టీమిండియా ఆటగాళ్లకు స్థానం లభించలేదు. దీంతో ఇండియన్ ప్లేయర్స్ లేకుండానే ఐసీసీ ప్లేయర్ ది మంత్ అవార్డుల నామినీల జాబితా విడుదల అయింది.