హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అమెరికా నుంచి వచ్చి సోమవారం (మార్చి 16) నాంపల్లి కోర్టులో సరెండర్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి 24 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డికి ఇంటర్మీడియెట్ చదువుతుండగా పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. ఆమె నటిగా ఎదుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ కలిసి మరణించాలని డిసైడ్ అయి.. 2002, ఫిబ్రవరి 23న సాయంత్రం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరునాడు చనిపోగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థే పురికొల్పాడని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సిద్ధార్థపై 306( ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్టిషీటు దాఖలు చేసింది.
ఈ కేసులో తొలుత 2004లో సెషన్స్ జడ్జి సిద్ధార్థకు ఐదేండ్ల జైలుశిక్ష, రూ.5 వేల ఫైన్ విధించారు. ఈ తీర్పును సిద్ధార్థ హైకోర్టులో సవాల్ చేయగా.. హైకోర్టు శిక్షాకాలాన్ని రెండేండ్లకు తగ్గించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ 2012లో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు ప్రత్యూషపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అప్పటినుంచి14 ఏండ్లుగా ఈ కేసులో17 పర్యాయాలు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. చివరగా గతేడాది నవంబర్ 19న ఇరు వైపు సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. 2026, ఫిబ్రవరి 17న ఈ కేసులో తుది తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది.
సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్ధించింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. అమెరికాలో సెటిలైనా నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి సుప్రీం ఆదేశాల మేరకు ఇండియా వచ్చి సోమవారం (మార్చి 16) నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
