నోరా ఫతేహి-సంజయ్ దత్ సాంగ్‌పై విమర్శలు: బోల్డ్ లిరిక్స్, స్టెప్పులు వైరల్.. ఈ పాట పాడింది మంగ్లీ!

నోరా ఫతేహి-సంజయ్ దత్ సాంగ్‌పై విమర్శలు: బోల్డ్ లిరిక్స్, స్టెప్పులు వైరల్.. ఈ పాట పాడింది మంగ్లీ!

హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నబాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. లేటెస్ట్ స్పెషల్ సాంగ్ ‘సర్కే చునార్ తేరి సర్కే’. నోరా ఫతేహి-సంజయ్ దత్ కలిసి స్టెప్పులు వేసిన ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘KD: ది డెవిల్‌’ చిత్రంలో భాగంగా రూపొందిన ఈ పాట రీసెంట్గా ప్రోమో విడుదలైన కొద్దిసేపటికే చర్చకు, వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తాజాగా ఫుల్ సాంగ్ సైతం రావడంతో సోషల్ మీడియాలో విమర్శలకు గురైంది.

గ్లామర్ విజువల్స్ – వైరల్ స్టెప్పులు

‘సర్కే చునార్ తేరి సర్కే’ సాంగ్లో నోరా ఫతేహి డ్యాన్స్ బార్ సెట్టింగ్‌లో ఘాఘ్రా చోళీ ధరించి, బ్యాకప్ డ్యాన్సర్ల మధ్య ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేస్తూ బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా హుక్ స్టెప్‌లో భాగంగా తన చీర పైటను కిందకు దించి మళ్లీ ఎత్తుకునే మువ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ విజువల్స్ అట్రాక్షన్గా ఉన్నప్పటికీ.. ‘లిరిక్స్, డ్యాన్స్’ పై ప్రేక్షకులతో పాటుగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

లిరిక్స్‌పై అభ్యంతరాలు

విజువల్స్‌కు విరుద్ధంగా పాట లిరిక్స్ వివాదానికి కారణమైంది. ఈ పాటలో ఫ్లర్టింగ్, డబుల్ మీనింగ్ లైన్స్‌తో పాటుగా బోల్డ్‌గా రాసిన లిరిక్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ స్టార్టింగ్ లైన్స్‌లోనే డబుల్ మీనింగ్ ఉండటం వల్ల పాట అసభ్యంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇది వినోదం కంటే రెచ్చగొట్టే కంటెంట్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. దీంతో “అసభ్యత హద్దులు దాటింది” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

NHRC స్పందన – నోటీసుల హెచ్చరిక

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యుడు ప్రియాంక్ కనుంగో కూడా పాట సాహిత్యం మరియు వీడియోపై అసహ్యం వ్యక్తం చేస్తూ..“ఇలాంటి కంటెంట్‌ను కుటుంబంతో కలిసి చూడగలమా?” అని ప్రశ్నిస్తూ, అవసరమైతే నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. సెన్సార్ బోర్డు పాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. 

అలాగే.. “బాలీవుడ్ నుండి నైతికత ఆశించడం లేదు, కానీ సెన్సార్ బోర్డు అశ్లీలతకు లైసెన్స్ ఇవ్వడం సిగ్గుచేటు. ఈ మానసిక రోగి తన మానసిక ధోరణులతో తరాలను నాశనం చేస్తున్నాడు. సమాజంలో ఈ మలినాన్ని వ్యాప్తి చేయడానికి మేము అనుమతించము, చర్యలు తప్పవు.. నోటీసులు జారీ చేస్తున్నాము” అని ఆయన పోస్ట్ చేశారు.

ఇదే సమయంలో ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. “భారతదేశంలో సెన్సార్ బోర్డు ఉందా? ఇలాంటి అసభ్యకరమైన, డబుల్ మీనింగ్ పాటలు సోషల్ మీడియాలోకి ఎలా అనుమతించబడతాయి?” అని ప్రశ్నించాడు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. “ఈ పాట టెంపోలు, బస్సులు, దుకాణాలు మరియు ప్రతి బహిరంగ ప్రదేశంలో ప్లే చేయబడుతుంది. ఇక ఈ పాటతో ఎంత మంది అమ్మాయిలు మరియు మహిళలు అసౌకర్యానికి గురవుతారో ఊహించండి.. వెంటనే నిషేధించాలి" అని హెచ్చరించారు.

ప్రస్తుతం ఈ వివాదంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. గ్లామర్, వైరల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ బాధ్యతపై మరోసారి చర్చ మొదలైన నేపథ్యంలో, ఈ వివాదం మరింత ముదురే అవకాశముంది.

అయితే, ఈ పాటను టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ పాడటంతో తెలుగు ప్రేక్షకులు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ లిరిక్స్ ఇలా అసభ్యతతో ఉన్నప్పుడు ఎలా ఒప్పుకున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రేమ్ దర్శకత్వం వహించిన కన్నడ పీరియాడికల్ యాక్షన్ డ్రామానే "KD: ది డెవిల్" మూవీ. ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్నారు. శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్ మరియు రమేష్ అరవింద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో విడుదల కానుంది.