హైదరాబాద్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ (88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని సొంత నివాసంలో సోమవారం (మార్చి 16) తుది శ్వాస విడిచారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గోవింద్ నాయక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి గెలుపొందారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 16 మందిలో ఆయన ఒకరు. గోవింద్ నాయక్ మృతికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
