రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్యారోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్ సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ ను పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేకుండా సెలవులు పెడితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని చెప్పారు. ప్రైవేట్​ఆస్పత్రుల్లో ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి కేసును పరిశీలించాలన్నారు. గర్భిణులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే చేస్తూ గర్భిణులకు వందశాతం ఏఎన్ సీ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని తెలిపారు. టీబీ నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్దేశించిన లక్ష్యం మేరకు అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు జరిగినప్పుడే ప్రజలకు మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రామారావు, అడిషనల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, డిప్యూటీ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వేణు మనోహర్, వైద్యాధికారులు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.