సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ రాత్రికి రాత్రే ఏ వార్త ఎలా వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. గత కొన్ని నెలలుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. అదే టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ "గోటీల ఫ్యాక్టరీ". బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలకు రాజశేఖర్ గోటీలను ఎగుమతి చేస్తున్నారని, దీని ద్వారా ఆయన నెలకు రూ. 3 నుంచి రూ. 4 కోట్లు గడిస్తున్నారని ప్రచారం జరిగింది.
నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు!
ఈ ప్రచారం ఏ స్థాయికి వెళ్లిందంటే.. కొందరు నెటిజన్లు ఏకంగా రాజశేఖర్ గోటీల కంపెనీలో తమకు 'గోటీ కౌంటింగ్ స్పెషలిస్ట్'గా ఉద్యోగం వచ్చిందంటూ ఫేక్ ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొందరు "ఈ ఫ్యాక్టరీలో జాబ్ సంపాదించడమే నా జీవితాశయం" అంటూ మీమ్స్ వర్షం కురిపించారు. రాజశేఖర్, జీవిత దంపతులు ఏదో ఫంక్షన్‌కు వెళ్లిన విజువల్స్ పట్టుకుని.. వారు ఫ్యాక్టరీని విజిట్ చేశారంటూ నకిలీ వీడియోలు సృష్టించారు. నెటిజన్లు సృష్టించిన ఈ 'గోటీల సామ్రాజ్యం' ఎంతలా పాకిందంటే, సాక్షాత్తూ హీరో రాజశేఖర్ గారే రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
నాకే తెలియకుండా ఫ్యాక్టరీ ఎక్కడిది?
లేటెస్ట్ గా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఈ అంశంపై నవ్వుతూ స్పందించారు. ఒకవైపు 'ఇదేమిటమ్మా మాయ మాయ' పాట ట్రెండింగ్, మరోవైపు ఈ గోటీల ఫ్యాక్టరీ గోల. ఇవన్నీ చూస్తుంటే చాలా సరదాగా ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నాకు బాగా తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి 'నిజంగానే మీకు ఫ్యాక్టరీ ఉందా?' అని అడుగుతున్నారు. నాకే తెలియకుండా నాకు ఫ్యాక్టరీ ఎక్కడి నుండి వచ్చింది? ఆ రూ. 4 కోట్లు ఎక్కడ ఉన్నాయో నాకూ తెలియదు" అంటూ నవ్వుతూ ఈ వార్తలను కొట్టిపారేశారు.
►ALSO READ | గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్.. పవన్ విశ్వరూపానికి ఫ్యాన్స్‌లో పూనకాలు!
'ఇదేమిటమ్మా మాయ మాయ' మేనియా
రాజశేఖర్ పాత సినిమా 'ఆయుధం'లోని ఈ పాట ఇటీవల రీమిక్స్ వెర్షన్‌తో నెట్టింట ఊపేస్తోంది. ఈ పాటపై వస్తున్న క్రేజ్ చూస్తుంటే తన సినిమా మళ్ళీ హిట్ అయిన అనుభూతి కలుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అనిల్ రావిపూడి వంటి దర్శకులు తనను ఇమిటేట్ చేయడం కూడా తనకు ఇప్పుడు ఎంతో సరదాగా అనిపిస్తోందని తెలిపారు.
పవర్‌ఫుల్ పాత్రలో..
ప్రస్తుతం రాజశేఖర్, శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ (Biker) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో తన పాత్రకు సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ అద్భుతంగా కుదిరిందని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి రాజశేఖర్ 'గోటీల బిజినెస్' అనేది ఒక క్రేజీ మీమ్ మాత్రమేనని తేలిపోయింది. మరి ఈ క్లారిటీ తర్వాత అయినా ఆ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ల గోల ఆగుతుందేమో చూడాలి!
