జీవితంలో ప్రతీ క్షణం విలువైంది.. ఉన్నది ఒకటే జిందగీ.. అందుకే వీలైనన్న జ్ఞాపకాలను పోగేసుకోవాలని అంటుంటారు. జీవితాన్ని ఇలా సంతోషంగా గడపాల్సిన యువకుడు పదమూడేండ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏ వైద్యుడూ అతనిని తిరిగి మాములు స్థితికి తీసుకురాలేకపోయాడు.
తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన కొడుకు అచేతన స్థితిలో ఉండటం చూసి అతని తల్లిదండ్రులు బాధపడని రోజు లేదు. కన్న కొడుకును అలాంటి స్థితిలో చూడలేక అతని కారుణ్య మరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి అంగీకరించడంతో 32 ఏండ్ల హరీశ్ రాణాకు ఎట్టకేలకు ముక్తి లభించింది. ఈ కారుణ్య మరణానికి సంబంధించిన వీడియో నెటిజన్లను కంటతడి పెట్టించింది. మనసున్న ప్రతీ ఒక్కరినీ కదిలించింది.
"Final farewell to Harish Rana. After 13 years in coma, he has reached Delhi AIIMS where life support will be withdrawn. Heartbreaking moment for his parents who cared for him tirelessly, knowing he would never wake up. Om Shanti🙏💔
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 15, 2026
pic.twitter.com/1WMeIMwYfJ
ఎందుకంటే.. బతకాలని ఆశగా ఉన్నా.. బతికే ఉండమని ప్రాణం కోరినా దేహం సహకరించని దయనీయ స్థితి హరీష్ రాణాది. హరీష్ రాణా లైఫ్ సపోర్ట్ తొలగించేందుకు ఆదివారం అతనిని ఇంటి నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. లైఫ్ సపోర్ట్ తొలగించారు. అతని కళ్లలో బాధ, విచారం స్పష్టంగా కనిపించింది. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఒక మహిళ అతని నుదిటిపై గంధపు తిలకం పెట్టింది. "అందరినీ క్షమించు... అందరికీ క్షమాపణలు కోరు.. ఇప్పుడు వెళ్ళిపో" అని హరీష్ రాణాతో ఆ మహిళ అంటున్న మాటలు నెటిజన్లను కదిలించాయి. బతికి ఉండి కూడా అనుభవించిన నరకం నుంచి ఆ మహిళ అతనికి ముక్తి ప్రసాదించిందని నెటిజన్లు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్ట్ 20న అతడు ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో హరీశ్ తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లిపోయాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేని స్థితికి చేరుకున్నాడు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా అతడి అనారోగ్యం నయం కాలేదు.
ఏండ్లు గడుస్తున్నప్పటికీ హరీశ్ హెల్త్ కండిషన్‌లో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. హరీశ్‌ను చూసుకుంటూ అతడి తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా, మానసికంగా చితికిపోయారు. దీంతో 2024లో హరీశ్‌కు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఆ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఆపై సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా నిరాశే ఎదురైంది.
హరీశ్ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు ఇచ్చిన స్పష్టమైన నివేదికతో మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లగా కేసు విచారణకు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు పరిశీలించి, హరీశ్ తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ధర్మాసనం తీర్పునిచ్చింది.
