Delhi Capitals: ఐపీఎల్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కి బిగ్ షాక్.. మెంటర్గా తప్పుకున్న పీటర్సన్

Delhi Capitals: ఐపీఎల్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కి బిగ్ షాక్.. మెంటర్గా తప్పుకున్న పీటర్సన్

Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని ఢిల్లీ జట్టు ఈసారి ట్రోఫీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బలమైన ఆటగాళ్లతో కూడిన జట్టు ఉన్నప్పటికీ, టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు జట్టుని కలవర పెడుతున్నాయి. 

ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటర్‌గా జాయిన్ అయ్యారు. అయితే ఈ సీజన్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మెంటర్ పాత్రకు అవసరమైనంత సమయం కేటాయించడం తనకు సాధ్యం కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కెవిన్ తెలియజేశారు. అయితే ఐపీఎల్ నుంచి పూర్తిగా దూరం కావడం లేదని కూడా స్పష్టం చేశారు. నేను కామెంట్రీ బాక్స్‌లో మళ్లీ కనిపిస్తాను.. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్.. త్వరలో మిమ్మల్ని అందరినీ చూడటానికి ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | Sarfaraz Ahmed: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్

ఇదిలా ఉండగా, భవిష్యత్తులో ఇంగ్లాండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తిని కూడా కెవిన్ పీటర్సన్ వ్యక్తం చేశారు. ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో అవకాశం వస్తే ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో జట్టుకు మార్గనిర్దేశం చేయాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. టెస్ట్ క్రికెట్‌లో ప్లేయర్స్ పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో వారికి అర్థం అయ్యే చెప్పాలి.. వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు. ఆ బాధ్యతను నిర్వహించడానికి నాకు కావాల్సిన అనుభవం, సామర్థ్యం ఉన్నాయని నమ్ముతున్నాను అని పీటర్సన్ వ్యాఖ్యానించారు.