Sarfaraz Ahmed: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈరోజు (మార్చి 15) ఈ విషయాన్ని అధికారికంగా అతడు వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సర్ఫరాజ్ చివరిసారిగా 2023లో టెస్టు మ్యాచ్ ఆడగా, 2021లో వైట్ బాల్ క్రికెట్‌లో చివరి మ్యాచ్ ఆడారు. తన రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా అతడు మాట్లాడుతూ.. పాకిస్థాన్ తరఫున ఆడటం తన జీవితంలో గొప్ప గౌరవమని పేర్కొన్నారు. 2006లో అండర్–-19 జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపినప్పటి నుంచి 2017లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న క్షణం వరకు పాక్ జెర్సీలో గడిపిన ప్రతి క్షణం ప్రత్యేకమైనదే అన్నారు.
నా కెరీర్ మొత్తంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు అని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అలాగే అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో తన కల నెరవేరినట్టే అన్నారు. ఎప్పుడూ నిర్భయంగా క్రికెట్ ఆడాలని, ఐక్యంగా ఉండే జట్టును నిర్మించాలని ప్రయత్నించాను.. నా కెప్టెన్సీలో బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లుగా ఎదగడం నాకు గర్వకారణంగా ఉందని ఆయన వెల్లడించారు. 2006లో దేశీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన సర్ఫరాజ్ అహ్మద్, 2007 నవంబర్‌లో జైపూర్ వేదికగా భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అనంతరం 2010లో టెస్టు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా తొలి మ్యాచ్ ఆడారు.
►ALSO READ | SA vs NZ: న్యూజిలాండ్పై అదరగొట్టిన సౌతాఫ్రికా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
తన టెస్టు కెరీర్‌లో సర్ఫరాజ్ మొత్తం 3031 పరుగులు చేయగా, వన్డేల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 42 ఇన్నింగ్స్‌లలో 818 పరుగులు చేశారు. ముఖ్యంగా 2017లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టును విజేతగా నిలిపి చరిత్రలో నిలిచిపోయారు. ఫైనల్లో పాకిస్థాన్ జట్టు భారత్ ని ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే 2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సర్ఫరాజ్ స్థానం జట్టులో స్థిరంగా తన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆ టోర్నమెంట్ తర్వాత ఆయన కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.
అయితే జూనియర్ క్రికెట్ ఆడే స్థాయిలో కూడా సర్ఫరాజ్ అహ్మద్ అనేక విజయాలు సాధించారు. 2006లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టును విజేతగా నిలిపారు. ఆ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించారు. ఆ భారత జట్టులో రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా వంటి ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. కాగా ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం సర్ఫరాజ్ అహ్మద్ త్వరలో పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయనను ఎంపిక కమిటీలో మిస్బా-ఉల్-హక్ తో పాటు సభ్యుడిగా నియమించారు.
