తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో అదుపుతప్పి 15 అడుగుల లోతులో పడింది కారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇద్దరు చిన్నపిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం ( ఆగస్టు 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు దగ్గర జరిగింది ఈ ఘటన.కర్ణాటకకు చెందిన కారు తిరుమల నుండి తిరుపతి వస్తుండగా అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్నట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చి ఢీకొనడంతో 15 అడుగుల లోతులో పడింది.
ఈ ఘటనలో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
