టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. తొలిరోజు 5.15 లక్షల మంది హాజరు

టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. తొలిరోజు 5.15 లక్షల మంది హాజరు
  • ఖమ్మం జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. దీనికి రెగ్యులర్ స్టూడెంట్లు  మొత్తం 5,17,197 మంది రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 5,15,374 మంది పరీక్ష రాశారు. కేవలం 1,823 మంది విద్యార్థులు అటెండ్ కాలేదు. ప్రైవేట్ స్టూడెంట్లు 786 మందికిగాను 626 మంది హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఉన్నతాధికారులు మొత్తం 1,240 పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేశారని తెలిపారు. తొలిరోజు ఎక్కడా ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.

అయితే, ఖమ్మం జిల్లాలో విధుల్లో అలసత్వం వహించినందుకు ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ తో పాటు ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు. వారి స్థానంలో వెంటనే కొత్త అధికారులను నియమించారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని  పీవీ శ్రీహరి స్పష్టం చేశారు. కాగా, తొలిరోజు పరీక్షలు కావడంతో విద్యార్థులు, పేరెంట్స్ తో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొన్నది. ఉదయం 8 గంటల నుంచే సెంటర్ల వద్దకు పిల్లలు చేరుకున్నారు.