భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం, వెలుగు : వచ్చే ఏడాది జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, పుణ్య పుష్కర స్నానాలు ఆచరించేందుకు వీలుగా కొత్తగా స్నానఘాట్లను నిర్మిస్తున్నట్లు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ తెలిపారు. శుక్రవారం సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్ గోదావరి పుష్కర ఏర్పాట్లపై పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్‌కలెక్టర్ మృణాల్శ్రేష్టతో కలిసి రివ్యూ చేశారు. యాక్షన్‌ప్లాన్ ప్రకారం పనులు చేపట్టాలన్నారు. వాజేడు-వెంకటాపురం మధ్య సుబ్బంపేటలో, పినపాక నియోజకవర్గంలో మల్లేపల్లిలో పుష్కరస్నానఘాట్లను నిర్మించాలని ఎమ్మెల్యేలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు అవసరమయ్యే నివేదికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఇంజినీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఘాట్లతో పాటు రోడ్లకు రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణంపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. సుందరయ్యనగర్, ముదిరాజ్బజార్ కాలనీలకు చెత్తకాల్చడం ద్వారా ఎదురయ్యే సమస్యలపై స్వయంగా కలెక్టర్ వెళ్లి పరిశీలించారు. అనంతరం మిథిలాస్టేడియంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం ఏర్పాట్లను తనిఖీ చేశారు. అంతకుముందు కలెక్టర్ కొత్తగూడెం జీజీహెచ్‌ను సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. డ్రగ్స్ స్టోర్‌ను పరిశీలించి, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
