మురుగు కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 మురుగు కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం  : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలో మురుగు కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం 21వ డివిజన్ లో రూ.545.60 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో రూ.1250 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారం, కేంద్ర ప్రభుత్వ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడతామన్నారు. 

నగరంలో తాగునీటి సమస్య లేకుండా మరో రూ.250 కోట్లతో పనులు చేపట్టినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా పౌర సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు వివరించారు. నగరం పరిశుభ్రంగా ఉండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. నగర మేయర్ నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.