T20 World Cup 2026: వరల్డ్ కప్ ముందు ఫిక్సింగ్ ఆరోపణలు.. స్టార్ క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ

T20 World Cup 2026: వరల్డ్ కప్ ముందు ఫిక్సింగ్ ఆరోపణలు.. స్టార్ క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ

వరల్డ్ కప్ ముందు స్టార్ క్రికెటర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. యూఎస్ఏ (USA) బ్యాటర్ ఆరోన్ జోన్స్‌ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ క్రికెట్ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 31 ఏళ్ల ఈ అమెరికా స్టార్ క్రికెటర్ పై  తక్షణమే నిషేధం విధించబడింది. తనపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించడానికి జోన్స్ కు 14 రోజుల సమయం ఉందని ఐసీసీ ధృవీకరించింది. “ఆరోన్ జోన్స్‌ను తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి సస్పెండ్ చేస్తున్నాము. ఈ ఆరోపణలపై స్పందించడానికి అతనికి జనవరి 28, 2026 నుండి 14 రోజుల సమయం ఇచ్చాము” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

జోన్స్ ప్రస్తుతం ఇండియా, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఆరోపణలు రావడంపై యూఎస్ఏ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ కోసం యూఎస్ఏ జట్టును త్వరలో ప్రకటించనున్నారు. సస్పెండ్ కారణంగా 15 మంది యూఎస్ఏ స్క్వాడ్ లో జోన్స్ సెలక్ట్ అవ్వడానికి అనర్హుడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు సూపర్-8 దశకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆరోన్ జోన్స్ వరల్డ్ కప్ కు లేకపోవడంతో యూఎస్ఏ బ్యాటింగ్ యూనిట్ బలహీనంగా మారింది. 

బార్బడోస్‌లో జరిగిన BIM10 లీగ్ (2023-24 సీజన్) సమయంలో ఆరోన్ జోన్స్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను జోన్స్ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది. BIM10 టోర్నమెంట్‌లో బుకీలు తనను సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని జోన్స్ అధికారులకు రిపోర్ట్ చేయలేదని తేలింది. అంతేకాదు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ACU) జరిపిన విచారణలో ఈ అమెరికా క్రికెటర్ సహకరించకుండా సాక్ష్యాలను దాచినట్టు తెలుస్తుంది. కేవలం BIM10 లీగ్ మాత్రమే కాకుండా మరో రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి కూడా అతనిపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.

ఆరోన్ జోన్స్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2019లో క్రికెట్ లో అరంగేట్రం చేసి USA క్రికెట్‌లో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. యూఎస్ఏ తరపున 52 వన్డేల్లో 34 యావరేజ్ తో 1664 పరుగులు చేశాడు. వీటులో 11 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది. 48 టీ20 మ్యాచ్ ల్లో 24 యావరేజ్ తో 770 పరుగులు చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో జోన్స్ అద్భుతంగా రాణించాడు. ప్రారంభ మ్యాచ్ లో కెనడాపై 40 బంతుల్లో 94 పరుగులు చేసి మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ పై 26 బంతుల్లో 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.