విజయ్ దేనికీ భయపడడు.. ‘జన నాయగన్’ అడ్డంకులపై తండ్రి ఎస్.ఏ.సి సంచలన వ్యాఖ్యలు.!

విజయ్ దేనికీ భయపడడు.. ‘జన నాయగన్’ అడ్డంకులపై తండ్రి ఎస్.ఏ.సి సంచలన వ్యాఖ్యలు.!


తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్ ' మూవీ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి  ఈ సినిమాను జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు చుట్టుముట్టడంతో విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది.  అటు తమ అభిమాన నటుడి ఆఖరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు. ఈ మూవీ జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలే అడ్డుగోడలా?

విజయ్ తన రాజకీయ పార్టీ ' తమిళగ వెట్రి కళగం ' ( TVK ) పార్టీని ప్రకటించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతూ నటించిన ఆఖరి చిత్రం' జననాయగన్' .  అయితే  ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంపై ఎస్.ఏ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన కుమారుడు విజయ్ దేనికీ భయపడడు. రాజకీయాల్లోకి వచ్చే వారికి ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం సహజమే. కానీ, అతని విజయవకాశాలు మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని అన్నారు. కరూరులో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు, ఈ అడ్డంకుల వెనుక ఉన్న అసలు కారణం కూడా అందరికీ అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత  యువత, మహిళల్లో చాలా చైతన్య వచ్చిందన్నారు..

కోర్టులో సెన్సార్ వివాదం

మద్రాస్ హైకోర్టులో ‘జన నాయగన్’ చిత్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.సెన్సార్ బోర్డు (CBFC) తన వాదనను వినిపించేందుకు తగిన సమయం ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. కేసును తిరిగి సింగిల్ జడ్జి వద్దకు పంపి, కొత్తగా విచారణ జరపాలని ఆదేశించింది.  దేశ భద్రతకు భంగం కలిగించేలా విదేశీ శక్తుల ప్రమేయం ఉన్న సీన్లు, ఆర్మీని తక్కువ చేసి చూపే సన్నివేశాలు ఉన్నాయని బోర్డు వాదిస్తోంది.

ఓటీటీ సంస్థ నుంచి ఒత్తిడి..

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని సమాచారం. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి అగ్ర తారాగణం నటించారు. ప్రస్తుతం విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది. కోర్టు కేసు సమస్యలు ముగించుకుని ఈ సినిమాను ఫిబ్రవరి లేదా మే నెలలో రిలీజ్ చేసే యోచనలో  మేకర్స్  ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, విడుదల ఆలస్యం అవుతుండటంతో ఓటీటీ సంస్థల నుంచి కూడా నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోంది. విజయ్ కెరీర్‌లో 69వ సినిమాగా, ఆఖరి చిత్రంగా వస్తున్న ఈ ‘జన నాయగన్’ అన్ని అడ్డంకులను దాటుకుని ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి మరి.