ఎక్కడి పొత్తులు అక్కడే.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పొత్తు సిత్రాలు !

ఎక్కడి పొత్తులు అక్కడే.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పొత్తు సిత్రాలు !

మున్సిపల్ ఎన్నికల్లో ‘లోకల్’​ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్​స్థాయిలో పొత్తులపై  ఎటూ తేల్చని ప్రధాన పార్టీలు.. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై  నిర్ణయం తీసుకుంటున్నాయి. అధికార పార్టీ  కొన్నిచోట్ల సీపీఐతో, ఇంకొన్ని చోట్ల సీపీఎంతో జట్టుకడ్తోంటే,  బీఆర్​ఎస్​ కొన్నిచోట్ల బీజేపీతో, ఇంకొన్నిచోట్ల సీపీఎం, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటోంది.

సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ , సీపీఎం పార్టీల నడుమ పొత్తు కుదిరింది. చేర్యాల మూడో వార్డును సీపీఎం కు కేటాయించగా, బీఆర్ఎస్ పాలక వర్గం ఏర్పడితే కో ఆప్షన్ పదవిని సీపీఎంకు కేటాయించాలని నిర్ణయించారు.  జనగామలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న సీపీఎం, అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని చేర్యాల మున్సిపాల్టీ లో మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకోవడం విశేషం. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ పార్టీతోనూ చర్చలు కొనసాగుతున్నాయి.

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 18 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను రిలీజ్ చేసింది. సీపీఐతో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో మిగిలిన వార్డులను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, సీపీఎం నడుమ పొత్తులు ఖరారయ్యాయి. ఒకవేళ  సీపీఐ వస్తే కలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే అభ్యర్థులను ప్రకటించడం లేదని సమాచారం.

భద్రాద్రికొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై రెండు రోజులుగా జరిగిన చర్చలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు ఖరారైంది. ఇదే జిల్లా అశ్వారావుపేటలో  బీఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతుండగా, ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ మధ్య మంతనాలు జరుపుతున్నారు. 

నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు ఖరారైంది. బుధవారం 18 మంది అభ్యర్థుల  జాబితాను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విడుదల చేయగా, వీరిలో ఒకరు సీపీఎం అభ్యర్థి ఉండడం గమనార్హం. వనపర్తి మున్సిపాలిటీ లోనూ బీఆర్ఎస్​, సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ18, 21 వార్డులను సీపీఎంకు ఆ పార్టీ కేటాయించింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీఆర్ ఎస్, బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. భూపాలపల్లి లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తులు కొలిక్కివచ్చాయి.  24 వార్డుల్లో కాంగ్రెస్​, 5 వార్డుల్లో సీపీఐ, సీపీఎంకు ఒక వార్డు కేటాయించారు. 

మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా బీజేపీ కి  10 వార్డుల్లో మాత్రమే  అభ్యర్థులు ఉన్నారు.  దీంతో మిగిలిన వార్డుల్లో  బీఆర్ ఎస్ కు లోపాయికారీగా మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మద్దూరు, మహబూబ్​నగర్​జిల్లాలోని  దేవరకద్రలో బీఆర్ఎస్​, బీజేపీ నేతలు అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు.

బీఆర్ఎస్​ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీజేపీ నుంచి, బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్​ నుంచి బలహీన అభ్యర్థులను నిలిపి సహకరించుకోవాలని, ఎన్నికల తర్వాత చైర్​పర్సన్​, వైస్ చైర్​పర్సన్​స్థానాలు పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఉదయం బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఓ ఫాం హౌస్​లో సమావేశమై చేతులు కలిపారు.