అగ్రరాజ్యం అమెరికా యుద్ధం కోసం భారీగానే ఖర్చుపెడుతోంది. ఇరాన్‌పై సాగిస్తున్న ఈ సైనిక దాడికి సంబంధించి వైట్ హౌస్ తాజాగా కాంగ్రెస్‌ను ఏకంగా 200 బిలియన్ డాలర్ల నిధులను కోరింది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.18 లక్షల కోట్లు. ఈ భారీ మొత్తం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటికే దాదాపు రూ.81 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అదనంగా నిధులు అడగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
యుద్ధం ఎంత ఖరీదైనదో చెప్పడానికి కేవలం మొదటి వారం లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభమైన కేవలం ఏడు రోజుల్లోనే అమెరికా 11.3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. విశేషమేమిటంటే.. ఈ భారీ ఖర్చు కేవలం క్షిపణులు, బాంబుల వంటి మందుగుండు సామగ్రికి మాత్రమే. సైనికుల మోహరింపు, ఇతర రవాణా ఖర్చులను కలిపితే ఈ లెక్క ఇంకా చాంతాడంత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ యుద్ధ వ్యయం అమెరికాలోని కీలక ప్రజా అవసరాల బడ్జెట్‌ల కంటే ఎంతో ఎక్కువగా ఉంది. ఉదాహరణకు అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ వార్షిక బడ్జెట్ రూ.79వేల 200 కోట్లు, వ్యాధి నియంత్రణ కేంద్రం బడ్జెట్ రూ.82వేల 800 కోట్లు మాత్రమే. అంటే ఏడాది పొడవునా అమెరికా ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కోసం ఖర్చు చేసే నిధుల కంటే.. కేవలం వారం రోజుల్లో యుద్ధం కోసం ఖర్చు చేసిన డబ్బే ఎక్కువగా ఉంది. ఈ పోలిక ఇప్పుడు అమెరికాలో అగ్గి రాజేస్తోంది. ట్రంప్ మైండ్ లేని పనులు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సగటు అమెరికన్.
మరోవైపు.. సైన్స్, రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ కేర్ లకు కేటాయించే నిధులను ట్రంప్ ప్రభుత్వం భారీగా కోత విధిస్తోంది. క్యాన్సర్ పరిశోధనా సంస్థలు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధులు నిలిపివేస్తూ, యుద్ధానికి లక్షల కోట్లు కుమ్మరించడంపై డెమొక్రాటిక్ సెనేటర్ ఆడమ్ షిఫ్ వంటి నేతలు మండిపడుతున్నారు. సొంత దేశంలో పరిశోధనలు, ఉద్యోగాల కోత విధిస్తూ యుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహమేంటో అర్థం కాక సామాన్య జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో. అలాగే మరోపక్క యుద్ధం నుంచి ఎగ్జిట్ ప్లాన్ లేకపోవటంతో ట్రంప్ ప్రభుత్వం మరింత ఒత్తిడిలోకి జారుకుంటోందనే వార్తలు అమెరికా పరువు తీస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా. ఇరాన్ ఇంతలా ప్రతిఘటిస్తుందని అస్సలు ఊహించలేదని నేరుగా ట్రంప్ చేసిన కామెంట్స్ చూస్తేనే అర్థం అవుతోంది అమెరికా వార్ ప్లాన్ ఎంత వీర్ గా ఉందో అంటూ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.
