అందరూ అవే మాటలు.. అదే కంటెంట్ కదా చూస్తుంది : భర్త KD సాంగ్ బూతులను సమర్థించిన రక్షిత

అందరూ అవే మాటలు.. అదే కంటెంట్ కదా చూస్తుంది : భర్త KD సాంగ్ బూతులను సమర్థించిన రక్షిత

కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జా, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  పాన్ ఇండియా మూవీ 'KD: ది డెవిల్'. 1970ల కాలం నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన "సర్కే చునర్ తేరి సర్కే" (Sarke Chunar Teri Sarke) అనే స్పెషల్ సాంగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. నోరా ఫతేహి స్టెప్పులేసిన ఈ పాటలోని సాహిత్యం అశ్లీలతకు పరాకాష్టగా ఉందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో సోషల్ మీడియాల్లో ఈ సాంగ్ వీడియోను డిలేట్ చేశారు.

విమర్శకులపై రక్షిత ప్రశ్నల వర్షం!

ఈ వివాదంపై దర్శకుడు ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. కేవలం ఒక పాటను బట్టి ఒక దర్శకుడి ప్రతిభను లేదా వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. "గతంలో ' 'ఫీలింగ్స్', 'చోళీ కే పీచే', 'డ్రీమమ్ వేకపమ్' వంటి డబుల్ మీనింగ్ పాటలు వచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు?  ఒక సినిమా మొత్తం శృంగారం గురించే మాట్లాడితే అది తప్పుగా అనిపించలేదా? కేవలం ఒక పాట వల్ల ప్రేమ్ ఒక చెడ్డ రైటర్ అయిపోతారా?" అని రక్షిత ప్రశ్నించారు. ప్రేక్షకులకు సినిమాను ప్రశ్నించే హక్కు ఉందని, కానీ వ్యక్తిగత దాడులు చేయడం, దూషించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.

రత్తపాతం, లైంగిక కంటెంట్ వైపు మొగ్గు..

ఒక్క పాట ఆధారంగా ఒక దర్శకుడి ఇన్నేళ్ల కష్టాన్ని, ఆయన ప్రతిభను కించపరచడం సరికాదని రక్షిత అభిప్రాయపడ్డారు. ప్రేమ్ ఒక కన్నడిగుడని, ఆయనను ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం సభ్యత కాదని హితవు పలికారు . 'ప్రతిరోజూ ఎన్నో పాటలు వస్తుంటాయి.. అందులో కొన్ని బాగుంటాయి, మరికొన్ని అభ్యంతరకరంగా ఉండొచ్చు, ఇంకొన్ని స్పెషల్ సాంగ్స్ అవ్వొచ్చు . ఈ రోజుల్లో ప్రేక్షకులు హింసతో కూడిన సినిమాలను, శృంగారభరితమైన కంటెంట్‌ను చాలా బహిరంగంగానే చూస్తున్నారని పేర్కొన్నారు.. 

కన్నడ పరిశ్రమ కష్టాలపై ఆవేదన

ఈ సందర్భంగా కన్నడ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను రక్షిత ప్రస్తావించారు. ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే కన్నడ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ,  టీవీ ఛానెళ్లకు విక్రయించడం చాలా కష్టమైన పని అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం ఒక యుద్ధంలా మారింది. కన్నడ దర్శకుడిగా ప్రేమ్ పడుతున్న కష్టం మాకు తెలుసు. KD మా బిడ్డ లాంటిది, చివరికి ఏం చేయాలో అదే చేస్తాం అని రక్షిత పేర్కొన్నారు.

మహిళా కమిషన్లు, సెలబ్రిటీల ఆగ్రహం

మరోవైపు ఈ పాటపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హర్యానా, కర్ణాటక మహిళా కమిషన్లు ఈ పాటలోని సాహిత్యంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటుడు రవి కిషన్ వంటి ప్రముఖులు ఈ పాటను "చీప్" గా వర్ణించారు. అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

లీగల్ చిక్కులు.. 

ఈ వివాదం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. ఒక న్యాయవాది ఇప్పటికే సెన్సార్ బోర్డును (CBFC) ఆశ్రయించి, ఈ పాటను నిషేధించాలని ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌లో కూడా దీనిపై ఫిర్యాదు నమోదైంది. వివాదం ముదరడంతో హిందీ వెర్షన్ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. ఈ మూవీలో ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవిచంద్రన్ నటించారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది.వివాదాల నడుమ రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.