దేశ అధ్యక్షులు, ప్రధాని వంటి వీఐపీలకు సెక్యూరిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ రూటే సపరేట్ అని చెప్పాలి. సెక్యూరిటీ కోసం ప్రధాని నెతన్యాహు ఫోన్ కి రెడ్ టేప్ వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. నెతన్యాహు ఫోన్ కి రెడ్ టేప్ వేయడానికి కారణమేంటి అన్న అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
జెరూసలేంలోని నెస్సెట్ లోని సెల్లార్ పార్కింగ్ గ్యారేజిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన బ్లాక్ లగ్జరీ కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆయన ఫోన్ కెమెరాకు, సెన్సార్లకు రెడ్ టేప్ వేసి ఉండటమే ఇందుకు కారణం. రెడ్ టేప్ అనేది నిషేధిత ప్రభుత్వ ప్రాంతాలలో ఇజ్రాయెల్ అధికారులు ఫాలో అయ్యే సెక్యూరిటీ మెజర్ అని తెలుస్తోంది.
సెన్సిటివ్ అరియాల్లోకి వెళ్ళినప్పుడు ఈ టాంపర్ ప్రూఫ్ సీల్స్ వాడటం ఇజ్రాయెల్ లో సాధారణమని తెలుస్తోంది. సెన్సిటివ్ సమాచారాన్ని రికార్డ్ చేయకుండా నిరోధించేందుకు ఫోన్ కెమెరా లెన్స్ లకు రెడ్ టేప్ వేసి బ్లాక్ చేస్తారని తెలుస్తోంది. ఈ టేప్ ను తీసేసే ప్రయత్నం చేస్తే.. పూర్తిగా పోదని.. టేప్ తాలూకు ముద్రలు ఉంటాయని తెలుస్తోంది.
