కేసీఆర్కు.. సిట్ ఇచ్చిన నోటీసుల్లో ఏముంది.. ఏ విషయాలను ప్రస్తావించారు..?

కేసీఆర్కు.. సిట్ ఇచ్చిన నోటీసుల్లో ఏముంది.. ఏ విషయాలను ప్రస్తావించారు..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసుల్లో ఏముందీ.. ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారు అధికారులు.. అసలు నోటీసుల్లో ఏమని ప్రస్తావించారు అనేది వివరంగా తెలుసుకుందాం..

సిట్ నోటీసుల్లోని సారాంశం:

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024, మార్చి 10వ తేదీన క్రైం నెంబర్ 243/2024 కింద కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరుగుతుంది. మరింత సమాచారం కోసం.. లోతైన విచారణ కోసం మిమ్మల్ని విచారించాలని నిర్ణయించటం జరిగింది.

ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో మీ పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ఈ విషయంలో నిజానిజాలను మీ నుంచి తెలుసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కేసులో నిజానిజాలు తెలుసుకోవటానికి మిమ్మల్ని విచారించాలని నిర్ణయించి.. 2026, జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది.

►ALSO READ | ఎక్కడి పొత్తులు అక్కడే.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పొత్తు సిత్రాలు !

1973, సెక్షన్ 160 ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ కింద.. 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు.. పోలీస్ స్టేషన్ కు వచ్చి విధిగా విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు.

మీరు కోరుకుంటే, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా హాజరు కావచ్చు లేదా ప్రత్యామ్నాయంగా.. హైదరాబాద్ నగరంలో విచారణకు అనుకూలమైన ఏదైనా ఇతర ప్రదేశాన్ని కూడా మీరు సూచించవచ్చు. మీరు విచారణకు ఎంపిక చేసుకున్న ప్రదేశాన్ని ముందుగానే తెలియజేయాలని స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఈ నోటీసు అందినట్లు తెలియజేయండి.