ఎకనమిక్ సర్వే 2026: రూపాయి రికార్డ్ పతనంతోనే చిక్కంతా.. పరిస్థితి తలకిందులే..!

ఎకనమిక్ సర్వే 2026: రూపాయి రికార్డ్ పతనంతోనే చిక్కంతా.. పరిస్థితి తలకిందులే..!

భారత ఆర్థిక వ్యవస్థపై రూపాయి రికార్డ్ పతనం చూపుతున్న ప్రభావంపై కేంద్ర ఆర్థిక సర్వే 2026 తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం.. రూపాయి విలువ క్షీణించడం వల్ల దేశంలో దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అంటే రూపాయి బలహీనపడటం వల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, యంత్రాలు, పరికరాల ధరలు పెరిగి దేశీయంగా సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉందని ఎకనమిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 92.0163 స్థాయికి పడిపోవడం మార్కెట్లో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి ప్రధానంగా అమెరికా ప్రభుత్వం భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌లు, విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం వంటి అంశాలు కారణమయ్యాయి. అలాగే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో జరుగుతున్న ఆలస్యం, జపాన్ బాండ్ ఈల్డ్స్‌లో పెరుగుదల కూడా రూపాయిపై అదనపు ఒత్తిడిని పెంచాయి.

ద్రవ్యోల్బణం విషయానికి వస్తే.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026-27లో ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయ్యే వస్తువులతో పాటు కమొడిటీ ధరలు కొంత మెతకగా ఉండటం వల్ల రూపాయి పతనం ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తుతానికి ధరలు అదుపులో ఉన్నాయని, అయితే వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిని తాకే అవకాశం ఉందని IMF, రిజర్వు బ్యాంక్ అంచనాలు చెబుతున్నాయి. దీనికి రూపాయి పతనం నేరుగా కారణమని చెప్పుకోవచ్చు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి పరిమితంగానే జోక్యం చేసుకుంటోందని రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 2 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. డిసెంబర్ నెలలో ఇది 1.33 శాతానికి పెరగడం గమనించదగ్గ విషయం. రాబోయే కాలంలో కొత్త జీడీపీ, సీపీఐ బేస్ ఇయర్ సిరీస్‌ల ప్రభావం కూడా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రూపాయి విలువను స్థిరీకరించటం, దిగుమతుల వల్ల వచ్చే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే రానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో మోడీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.