నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికే తెలుసు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ లో కూడా నేపాల్ జట్టు ఆడబోయే మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ జట్టు ఆడే మ్యాచ్ లకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఫిబ్రవరి 7 నుంచి జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో నేపాల్ క్రికెట్ కు అనూహ్యంగా నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఏర్పడింది. నేపాల్ జట్టు వరల్డ్ కప్ లో ఆడబోయే మ్యాచ్ లకు డిమాండ్ మాములుగా లేదు. ఇండియా తర్వాత నేపాల్ మ్యాచ్ లకు ఎక్కువగా టికెట్స్ అమ్ముడుపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నేపాల్ ముంబైలోని ఆడబోయే నాలుగు మ్యాచ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇండియా మ్యాచ్ ల తర్వాత నేపాల్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు రెండవ స్థానంలో ఉన్నాయి. వాంఖడేలో నేపాల్ క్రికెట్ అభిమానులు చాలా మంది తమ జట్టును సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు నేపాల్ అభిమానులు అతిపెద్ద ట్రావెలింగ్ ఫ్యాన్‌బేస్‌గా ఉండబోతున్నారని స్పష్టమవుతోంది. క్రికెట్ ఆడే దేశంగా నేపాల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వరల్డ్ కప్ లీగ్ దశలో నేపాల్ తమ నాలుగు మ్యాచ్ లు ముంబై ఐకానికి స్టేడియం వాంఖడేలో ఆడనుంది. నేపాల్ ఫిబ్రవరి 8న ఇంగ్లాండ్ తో తమ తొలి మ్యాచ్ లో తలపడుతుంది. ఫిబ్రవరి 12న ఇటలీతో.. ఫిబ్రవరి 15న వెస్టిండీస్ తో.. ఫిబ్రవరి 17న స్కాట్లాండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2026 టీ20 వరల్డ్ కప్ లో నేపాల్ జట్టుకు రోహిత్ పౌడెల్ కెప్టెన్సీ చేయనున్నాడు. దీపేంద్ర సింగ్ ఐరీ డిప్యూటీగా వ్యవహరిస్తాడు.
వరల్డ్ కప్ కు నేపాల్ జట్టు:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, లోకేశ్ బి మల్లా
