హైదరాబాద్: అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం (మార్చి 15) ఎల్బీ స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
“రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
“రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి, షబ్బీర్ అలీకి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాం. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించాం” అని గుర్తుచేశారు.
►ALSO READ | తెలంగాణ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి
ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు సింహ భాగమిచ్చి ముందుకు నడిపిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
“ఈ ప్రభుత్వం మనందరిదీ. నేను మీ సోదరుడిని. మనమందరం కలిసి తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి కష్టపడితేనే ఈ రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారం కావాలి” అని కోరారు.
