వికారాబాద్, వెలుగు: అధిక దిగుబడితో పాటు లాభసాటి పంటలను పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ రకం వరి పండిస్తే అధిక లాభాలు వస్తాయో రైతులకు సూచించాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం మాట్లాడుతూ.. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు రూపొందించిన వివిధ రకాల పంటలు సాగు చేసే విధంగా శాఖ పరంగా దృష్టి సారిస్తామన్నారు. వివిధ కంపెనీల వల్ల నాణ్యమైన విత్తనాలు అందకపోవడంతో రైతులు మోసపోతున్నారని, ముందస్తుగా అన్యాయం జరగకుండా సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్ రెడ్డి, రాజా మధు శేఖర్, ఏడీఏలు సందీప్, శంకర్ రాథోడ్, లక్ష్మీ కుమారి, వెంకటేశం, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు..
