నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో వచ్చే సినిమాలు, సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. చాలామందికి తెలియని అంశాలు, స్ట్రాంగ్ మెసేజ్-ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అలాగే, తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ వంటి భాషలు, ఏ ప్రాంతం లేదా దేశానికి సంబంధించినవో చూసుకోకుండా, అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్లాట్‌ఫారమ్‌లో అందించడం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకత. అందుకే ఓటీటీ ఆడియన్స్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే సినిమాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో ముఖ్య కారణం ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రతి జోనర్‌లో కథలను పరిచయం చేస్తూ అంచనాలు పెంచుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బాలీవుడ్ వెబ్ సిరీస్, ఆడియన్స్ను తెగ థ్రిల్ అయ్యేలా చేస్తుంది. అదే ‘తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్’ (Taskaree:The Smuggler's Web). ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన వెబ్‌సిరీస్ ఇది. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో.. ఇమ్రాన్ హష్మీతో పాటుగా శరద్ కేల్కర్, నందీష్ సంధు, అనురాగ్ సిన్హా, జోయా అఫ్రోజ్, అమృతా ఖాన్విల్కర్ నటించారు.
‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. ఉత్కంఠతో కూడిన కథనం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లే వలన ఇది గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. సేక్రేడ్ గేమ్స్, హీరామండి వంటి సక్సెస్ ఫుల్ ఇండియన్ సినిమాలను ‘తస్కరీ’ బీట్ చేసి సత్తా చాటింది.
నెట్‌ఫ్లిక్స్ డేటా విభాగం ‘టుడుమ్’ (Tudum) ప్రకారం, గత వారం (జనవరి 12–18)లో ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ షోల జాబితాలో ‘తస్కరీ’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ కేవలం ఒక వారం లోనే 5.4 మిలియన్ల (54 లక్షల) వ్యూస్ రాబట్టింది.
పాపులర్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ‘కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేటెడ్?’ (4 మిలియన్ల వ్యూస్)ను వెనక్కి నెట్టి తస్కరీ టాప్ ప్లేస్‌ను సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన జుజుత్సు కైసెన్, ఆల్ఫా మేల్స్ వంటి షోలను కూడా తస్కరీ అధిగమించింది. టాప్-10లో ఉన్న ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా డైరెక్టర్ నీరజ్ పాండే మాట్లాడుతూ, “గ్లోబల్ టాప్ 10లో ఒక ఇండియన్ వెబ్ సిరీస్ నంబర్ 1గా నిలవడం కేవలం ఈ షో విజయమే కాదు, భారతీయ కథలకు దక్కిన గొప్ప గౌరవం” అని ఆనందం వ్యక్తం చేశారు.
కథేంటంటే:
ఈ కథ బడా చౌదరి (శరద్ కేల్కర్) నేతృత్వంలోని ఒక పెద్ద సిండికేట్ చుట్టూ తిరుగుతుంది. అతను కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన గడియారాలు, లగ్జరీ వస్తువులను ఇండియాలోకి అక్రమంగా తీసుకొస్తాడు. ఇదంతా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా జరుగుతుంటుంది. ఈ స్మగ్లింగ్‌లో కస్టమ్స్ అధికారులు కూడా పాలుపంచుకుంటారు.
స్మగ్లింగ్ ఆపలేక విసిగిపోయిన ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు అసిస్టెంట్ కమిషనర్ ప్రకాష్‌కుమార్ (అనురాగ్ సిన్హా)ని నియమిస్తుంది. అతను అవినీతి అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసి, అప్పటికే సస్పెండ్ అయిన కస్టమ్స్ ఆఫీసర్ అర్జున్ మీనా ( ఇమ్రాన్ హష్మి )తోపాటు రవీందర్ గుజ్జర్ (నందీష్ సంధు), మిథాలీ (అమృత ఖాన్విల్కర్)ని టీంలో చేర్చుకుంటాడు. వాళ్లు స్మగ్లింగ్‌ని ఎలా ఆపారు? చౌదరి ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి స్మగ్లర్లు బంగారాన్ని అక్రమంగా దేశంలోకి ఎలా తరలిస్తారన్న అంశాన్ని ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో చూశాం. అయితే ఆ చిత్రాల్లో ఈ అంశం కొద్దిపాటి సన్నివేశాలకే పరిమితమైంది. కానీ పూర్తిగా స్మగ్లింగ్ నేపథ్యంతోనే తెరకెక్కిన సిరీస్ ‘తస్కరీ’ ప్రత్యేకతను సంతరించుకుంది. ‘తస్కరీ’ అనే పదానికి తస్కరించడం అనే అర్థం. ఈ సిరీస్‌లో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ పనితీరుపై ప్రేక్షకుడికి కొంత అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.
విదేశాల నుంచి తీసుకొచ్చే వస్తువులకు డ్యూటీ చెల్లించకపోవడం వల్ల దేశానికి ఎంత మేర నష్టం జరుగుతోంది? ముంబయి విమానాశ్రయం ద్వారా ఎంత బంగారం అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తోంది? కస్టమ్స్ అధికారులు ఈ అక్రమాలకు ఎందుకు పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? వంటి కీలక ప్రశ్నలను కథలో సహజంగా ప్రస్తావించడం ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
స్మగ్లింగ్ ప్రపంచాన్ని లోతుగా పరిచయం చేస్తూ, వాస్తవాలకు దగ్గరగా కథను నడిపించడం వల్ల ‘తస్కరీ’ ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తుంది. అక్రమ రవాణా వెనక ఉన్న వ్యవస్థ, దానికి ఎదురుగా నిలిచే అధికారుల పోరాటం ఈ సిరీస్‌కు ప్రధాన బలం.
