హైదరాబాద్: అక్రమ సరోగసీ రాకెట్ కేసులో కీలక పరిణామం జరిగింది. డాక్టర్ నమ్రత ఆస్తులను ED అటాచ్ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమ్రతకు చెందిన రూ.29.76 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం 50 స్థిరాస్తులను ED అధికారులు సీజ్ చేశారు.
భూములు, ఫ్లాట్లు, ఆస్పత్రి సహా పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో డాక్టర్ నమ్రత అక్రమ సరోగసీ రాకెట్ నడుపుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే.
సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని.. సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దాదాపు 80 ఫేక్ సరోగసీలు చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించిన సంగతి తెలిసిందే.
►ALSO READ | హైదరాబాద్ మధురానగర్ లో దారుణం: రూ. 2 వేల 500 కట్టినా జాబ్ ఇప్పించలేదని.. కత్తితో పొడిచి చంపేశాడు..
పిల్లల్ని అమ్మే గ్యాంగులతో లింకులు పెట్టుకున్న డాక్టర్ నమ్రత.. అనేక దారుణాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అస్సాం, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్‌తో నమ్రతకు లింకులు ఉన్నాయి.
పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష, పవన్‌తో సంబంధాలు ఉన్నాయి. గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ అరెస్టయిన నందిని, హర్ష, పవన్ నుంచి ఒక్కొక్క శిశువుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చి డాక్టర్ నమ్రత కొనుగోలు చేసింది. ఐవీఎఫ్కోసం వచ్చే దంపతులను సరోగోసీ వైపు మళ్లించిన నమ్రత అనేక అక్రమాలకు పాల్పడింది.
