ఇండిగో వరుస వైఫల్యాలు.. కంపెనీ సీఈవో రాజీనామా

ఇండిగో వరుస వైఫల్యాలు.. కంపెనీ సీఈవో రాజీనామా

వరుస వైఫల్యాలతో విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదుపేసిన ఇండిగో సంస్థలో కీలక పరిణామం జరిగింది. తమ కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆయన రాజీనామా మంగళవారం (మార్చి 10) నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. 

సంస్థ నుంచి ఎల్బర్స్ తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో రాహుల్ భాటియా బాధ్యతలు తీసుకోనున్నారు. మధ్యంతర సీఈవోగా భాటియాకు బాధ్యతలు అప్పగించినట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యేలోపు కొనసాగుతారని యాజమాన్యం తెలిపింది. 

ఏంటి ఇండిగో సంక్షోభం:

నవంబర్ 1, 2025 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల రెండో దశ ఈ సంక్షోభానికి ప్రధాన మూలకారణం.  ఈ నిబంధనలు పైలట్‌‌‌‌‌‌‌‌ల వారపు విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచాయి.  ఇది పైలట్‌‌‌‌‌‌‌‌ల అలసట రిస్క్‌‌‌‌‌‌‌‌ను తగ్గిస్తుంది. ఈ మార్పులు విమాన ప్రయాణాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని లక్ష్యంగా చేసిన ప్రయత్నం. 

ఈ నిబంధనల గురించి రెండు సంవత్సరాల ముందు నుంచే పూర్తి అవగాహన ఉన్నప్పటికీ,  కొత్త నిబంధనలకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు రోస్టరింగ్ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇండిగో నిర్లక్ష్యం వహించింది.  భారతదేశంలో అత్యధిక విమానాలను నడుపుతున్న సంస్థగా, సిబ్బంది కొరతను సరిచేయడానికి ఇండిగో ప్రణాళికా లోపం సంస్థ కార్యకలాపాలను ఒక్కసారిగా కుప్పకూల్చింది.

డీజీసీఏ వైఫల్యం 

దేశ పౌర విమానయాన భద్రతకు అత్యున్నత బాధ్యత వహించే  డీజీసీఏ చర్యలు ఈ సంక్షోభంలో అసమర్థతను చూపించిందని నిపుణులు విమర్శిస్తున్నారు. డీజీసీఏ, ఇండిగోకు  షోకాజ్ నోటీసు ఇవ్వడం న్యాయపరమైన చర్య అయినప్పటికీ,  వేలాది విమానాలు రద్దై, ప్రయాణీకులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన తర్వాత మాత్రమే డీజీసీఏ  స్పందించింది. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రూల్స్1937 ప్రకారం డీజీసీఏ సంస్థకు విమానయాన ఆపరేటర్‌‌‌‌‌‌‌‌పై  భారీ జరిమానాలు విధించే  అధికారం లేదా ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ రద్దు చేసే అధికారం ఉంది.  ఈ జాప్యం డీజీసీఏ వ్యవస్థాపరమైన పర్యవేక్షణ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. ముందస్తు తనిఖీ  చేయడంలో విఫలమవడం, డీజీసీఏ తన ప్రాథమిక భద్రతా విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టేనని విమర్శలు వచ్చాయి.