బీజేపీతో రామగుండం ఎరువుల కర్మాగారానికి దెబ్బ

బీజేపీతో  రామగుండం ఎరువుల కర్మాగారానికి దెబ్బ
  • సరైన నిర్వహణ లేకుండా సంస్థ నడుపుతుండ్రు
  • కేంద్ర మంత్రికి లేఖ రాసినా, వ్యక్తిగతంగా కలిసినా నో రెస్పాన్స్
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించాలని డిమాండ్

పెద్దపల్లి: బీజేపీ నిర్లక్ష్యంతో రామగుండంలోని ఎరువుల కర్మాగారం దెబ్బతింటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. సంస్థను సరైన నిర్వహణ లేకుండా నడుపుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కలసి సమస్యలను వివరిం చినప్పటికీ సరైన స్పందన రాలేదన్నారు. 

ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ (RFCL ) సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం లేదని, 70 శాతం మాత్రమే ప్రొడక్షన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చెప్పారు. సంస్థ హెడ్ ఆఫీస్ ను హైదరాబాద్ మార్చాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదన్నారు. 

గతంలో మూతపడిన సంస్థను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి కృషిచేశారని గుర్తు చేశారు. అనంతరం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో సంస్థను మళ్లీ ప్రొడక్షన్లోకి తీసుకువచ్చారన్నారు.

కొలనూరు ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్:

కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని ఈ సందర్భంగా ఆయన  అన్నారు. రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడనుందని చెప్పారు. కొలనూరు, ఓదెల ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఓదెల ప్రాంతానికి కూడా ఆర్ ఓబీ మంజూరు అయ్యేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.