తేజస్వి అడపా నిర్మాణంలో, భాస్కర్ జక్కుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'జమానా'. సూర్య శ్రీనివాస్, సంజీవ్ హీరోలుగా, స్వాతి కశ్యప్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మ్యూజియం దొంగతనం చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం...
కథా నేపథ్యం
సినిమా ప్రారంభమే ఒక భారీ మ్యూజియం దొంగతనంతో మొదలై, ఆడియన్స్‌ను కథలోకి లాగేస్తుంది. కథానాయకుడు సూర్య (సూర్య శ్రీనివాస్) ఒక తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలతో కాలం వెళ్లదీయడం ఇష్టం లేక, ఏదైనా ఒక పెద్ద స్కామ్ చేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అదే సమయంలో స్వాతి (స్వాతి కశ్యప్) తో ప్రేమలో పడతాడు. కానీ, కథలోకి సంజీవ్ గ్యాంగ్ ప్రవేశించడంతో సమీకరణాలు మారుతాయి. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడు, ఒక అండర్ వరల్డ్ మాఫియా లీడర్.. ఇలా వేర్వేరు వర్గాలు ఒకే డీల్ కోసం పోటీ పడుతుంటారు. ఒకరికి తెలియకుండా ఒకరు చేసే ఈ మైండ్ గేమ్స్, ఆ 'బిగ్ డీల్' వెనుక ఉన్న రహస్యం ఏంటనేదే 'జమానా' అసలు కథ.
ఎలా ఉందంటే..
దర్శకుడు భాస్కర్ జక్కుల ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాకపోయినా, దానిని తెరపైకి తెచ్చిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్ లో హీరో చేసే చిన్న చిన్న స్కామ్‌లు, లవ్ ట్రాక్ , సంజీవ్ ఎపిసోడ్‌తో కథ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా 'పది లక్షల ఎపిసోడ్' సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండ్ హాఫ్‌పై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. కథనం ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. కథ ఎక్కడా పక్కదారి పట్టకుండా, గ్రిప్పింగ్‌గా సాగడం ఈ సినిమాకు ప్రధాన బలం నిలిచిందంటున్నారు సినీ ప్రియులు..
నటీనటుల పెర్ఫార్మెన్స్
హీరో సూర్య శ్రీనివాస్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో, సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా తన బాడీ లాంగ్వేజ్‌ను మలుచుకున్నాడు. హీరోయిన్ స్వాతి కశ్యప్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కీలక సన్నివేశాల్లో తన నటనతో మెప్పించింది. సంజీవ్, ఇతర గ్యాంగ్ లీడర్లుగా నటించిన వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా...
ఈ మూవీ సాంకేతికంగా 'జమానా' ఉన్నత ప్రమాణాలతో ఉంది. కేశవ కిరణ్ అందించిన పాటలు బాగున్నాయి, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా స్థాయిని పెంచింది. థ్రిల్లర్ సీన్స్‌లో వచ్చే సౌండ్ ట్రాక్ ఉత్కంఠను పెంచింది. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. సినిమా ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా క్రిస్పీగా ఉండటంలో ఎడిటర్ కృషి కనిపిస్తుంది.ఏ. జగన్ కెమెరా వర్క్ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది. మ్యూజియం సీన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ గా చాలా రిచ్‌గా ఉన్నాయి.
మొత్తానికి, 'జమానా' ఒక పక్కా ప్లాన్డ్ క్రైమ్ థ్రిల్లర్. కొత్త దర్శకుడైనా భాస్కర్ జక్కుల ఎక్కడా తడబడకుండా సినిమాను అద్భుతంగా మేకింగ్ చేశారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీరు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మైండ్ గేమ్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారైతే, 'జమానా' మీకు కచ్చితంగా మంచి అనుభూతినిస్తుంది.
