బీహార్‌లో విషాద ఘటన : బంధువులు రాలేదని.. తల్లి శవాన్ని మోసిన కూతుళ్లు...

బీహార్‌లో విషాద ఘటన : బంధువులు రాలేదని.. తల్లి శవాన్ని మోసిన కూతుళ్లు...

బీహార్‌లోని చాప్రా జిల్లా జవైనియన్ గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.  కన్నతల్లి చనిపోతే కడసారి చూసేందుకు బంధువులు రాలేదు, సాయం చేసేందుకు ఊరి వాళ్ళు కూడా  పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు కూతుళ్లే  తల్లి శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

 వివరాలు ప్రకారం...  బబితా దేవి అనే మహిళ భర్త రవీంద్ర సింగ్ ఏడాదిన్నర క్రితమే చనిపోయాడు. అప్పటి నుండి  కుటుంబం తినడానికి తిండి లేక, అండగా ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు బబితా దేవి కూడా మరణించడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు.

తల్లి చనిపోయిన విషాదంలో ఉన్న కూతుళ్ళకు ఊరి వారు ఎవరూ సాయం చేయలేదు. కనీసం శవాన్ని మోసేందుకు కూడా బంధువులు రాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కచెల్లెల్లే  తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశారు. పేదరికం వల్లే బంధువులందరూ వాళ్ళని దూరం పెట్టారని గ్రామస్థులు చెబుతున్నారు.

 సోషల్ మీడియాలో దీనికి సంబంధించి  ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.  మానవత్వం చచ్చిపోయిందా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికీ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.