ట్రంప్ హయాంలో రెండోసారి షట్ డౌన్.. నిధుల కొరతతో నిలిచిన ప్రభుత్వ సేవలు

ట్రంప్ హయాంలో రెండోసారి షట్ డౌన్.. నిధుల కొరతతో నిలిచిన ప్రభుత్వ సేవలు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి గందరగోళంలో చిక్కుకుంది. 2026 బడ్జెట్‌కు కాంగ్రెస్ ఆమోదం రాకపోవటంతో.. అర్ధరాత్రి గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం పాక్షికంగా 'షట్ డౌన్' లోకి వెళ్లింది. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా నిధుల కొరతతో ప్రభుత్వం స్తంభించిపోవడం ఇది రెండోసారి. ఈ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ.. సామాన్య ప్రజలలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిధుల విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తలెత్తిన వివాదమే తాజా సంక్షోభానికి ప్రధాన కారణమైంది.

ఈ ఉద్రిక్తతలకు మిన్నియాపాలిస్‌లో జరిగిన ఒక విషాద ఘటన నిప్పు రాజేసింది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడంపై డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్ స్మగ్లర్లు, నేరగాళ్లను పట్టుకోవాల్సిన యంత్రాంగం.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బలప్రయోగం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వనరులను వృథా చేస్తూ.. అమెరికన్ల భద్రతను పణంగా పెడుతోందని సెనేట్ మైనారిటీ విప్ డిక్ డర్బిన్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ విభేదాల కారణంగానే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి నిధులు మంజూరు చేసే చర్చలు అర్ధాంతరంగా ఆగిపోవటంతో సమస్య మెుదలైంది.

అయితే ఈ షట్ డౌన్ ప్రభావం తాత్కాలికమేనని తెలుస్తోంది. సెనేట్ ఇప్పటికే ఐదు కీలక నిధుల బిల్లులతో పాటు, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కోసం రెండు వారాల తాత్కాలిక నిధుల ప్యాకేజీని ఆమోదించింది. దీనికి అధ్యక్షుడు ట్రంప్ కూడా మద్దతు ప్రకటించారు. వచ్చే వారం ప్రారంభంలో ప్రతినిధుల సభ  ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే ప్రభుత్వం మళ్లీ యథావిధిగా పనిచేస్తుంది. గత ఏడాది జరిగిన 43 రోజుల సుదీర్ఘ షట్ డౌన్ వల్ల లక్షలాది మందికి ఆహార సాయం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో వేల విమానాలు కూడా రద్దయ్యాయి. అటువంటి దారుణ పరిస్థితి మళ్లీ రాకూడదని ఇరు పక్షాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతానికి కొన్ని ఫెడరల్ ఏజెన్సీలు నిధుల లేమితో సతమతమవుతున్నప్పటికీ.. అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. రాజకీయ పంతాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఇరు పక్షాలు ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ఈ వారాంతంలో జరిగే చర్చలు అమెరికా ఆర్థిక, పరిపాలనా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.