ఫిబ్రవరి 1న బడ్జెట్ ధమాకా: ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయ్..

ఫిబ్రవరి 1న బడ్జెట్ ధమాకా: ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయ్..

సాధారణంగా శని, ఆదివారాల్లో భారతదేశంలో స్టాక్ మార్కెట్లు మూతపడి ఉంటాయి. కానీ ఈసారి ఇన్వెస్టర్లకు ఒక అరుదైన అనుభవం ఎదురుకాబోతోంది. అదే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ.. కేంద్ర బడ్జెట్ సందర్భంగా BSE, NSE పని చేయటమే. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇప్పటికే అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ప్రకటన సమయంలో మార్కెట్లలో వచ్చే ఒడిదుడుకులను అందిపుచ్చుకోవడానికి, ఇన్వెస్టర్లకు లైవ్ ట్రేడింగ్ విండోను కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే బడ్జెట్ నిర్ణయాలపై ఇన్వెస్టర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఆదివారం రోజు కూడా ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సాధారణ పని వేళల్లో మాదిరిగానే ట్రేడింగ్ కొనసాగుతుంది.

బడ్జెట్‌కు ముందుగా జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో దేశ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విశ్లేషణను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వివరించారు. ఈ సర్వేలోని అంశాల ఆధారంగా బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పథకాలు వస్తాయి, పన్ను రాయితీలు ఉంటాయా లేదా అనే ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో నెలకొంది. గతంలో కూడా 2015, 2020, 2025 సంవత్సరాల్లో బడ్జెట్ రోజు వారాంతాల్లో రావటంతో మార్కెట్లు ప్రత్యేకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి.

సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు అత్యంత అస్థిరంగా ఉంటాయి. ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రక్షణ, వ్యవసాయం, పన్ను సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలు మార్కెట్ గమనాన్ని మారుస్తాయి. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ద్వారా ప్రపంచ మార్కెట్ల ప్రభావం కంటే, దేశీయ ఆర్థిక విధానాలకే మార్కెట్లు ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది. ఈ స్పెషల్ డే ట్రేడింగ్ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ట్రేడర్లు ఇప్పటికే సిద్ధమవుతున్నారు.