దాయాది దేశం పాక్ భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. చాలా దశాబ్ధాలుగా పాక్ తన ఆర్థిక వ్యవస్థను బాగుచేసుకోవటం కంటే పొరుగున ఉన్న భారత్ పతనం కోసం ఎక్కువగా దృష్టి పెట్టడం, దానికోసం భారీగా నిధులు ఖర్చు చేయటం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. దీనికి తోడు ఉగ్రవాదానికి ఫండింగ్ పెరగటం పాక్ ప్రజలను పేదలుగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు కొత్త నేతలు వచ్చినా ఆదేశాన్ని బాగుకాకుండా ఆపుతోంది మాత్రం అక్కడి ఆర్మీ అన్నది పచ్చి నిజం. ఈ క్రమంలో పాక్ ప్రధాని చేసిన కామెంట్స్ వారి ధీన స్థితిని ప్రతిబింబిస్తోంది.
పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం ఆ దేశ పాలకులను ఆత్మరక్షణలో పడేసింది. విదేశీ అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగడం అవమానకరంగా ఉందని తాను మునీర్ డబ్బు కోసం వెళ్లటం సిగ్గేసేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బాహాటంగానే అంగీకరించారు. డబ్బుల కోసం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అడుక్కోవాలంటే తనకు, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు చాలా సిగ్గుగా అనిపిస్తోందని ఇస్లామాబాద్‌లో ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో అన్నారు. అప్పులు తీసుకోవడం మన ఆత్మగౌరవానికి పెద్ద భారం. ఈ పరిస్థితి వల్ల మన తలలు సిగ్గుతో వంగిపోతున్నాయి. అప్పు ఇచ్చే దేశాలు చెప్పే ప్రతి మాటకు మనం కాదనలేకపోతున్నాం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు షరీఫ్.
పాకిస్థాన్ ప్రస్తుతం హైబ్రిడ్ పాలనలో ఉందని, దేశ మనుగడలో సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని షరీఫ్ బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడంలో ఆర్మీ చీఫ్ మునీర్, సైన్యం 100 శాతం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పెట్రోల్ స్మగ్లింగ్ అరికట్టడం, చక్కెర పరిశ్రమను చక్కదిద్దడం వంటి పనుల్లో సైన్యం సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. గత ఏడాది అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొంది, అణ్వాయుధ నియంత్రణతో సహా అన్ని సైనిక విభాగాలపై పట్టు సాధించిన తర్వాత.. ప్రజలు సైన్యానికి మధ్య బంధం మరింత బలపడిందని షరీఫ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక గణాంకాలు భయంకరంగా ఉన్నాయి. 2018లో 21.9 శాతంగా ఉన్న పేదరికం, ప్రస్తుతం 45 శాతానికి చేరుకుంది. దాదాపు 80 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. టెక్స్‌టైల్ రంగం మినహా ఇతర రంగాల్లో అభివృద్ధి శూన్యం. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను డిపాజిట్లుగా ఉంచడం వల్లనే దేశం ఇంకా దివాళా తీయకుండా ఉందని షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం చైనా నుంచే 2024-25లో 4 బిలియన్ డాలర్ల నిధులు పొందినట్లు అంచనా.
అయితే కేవలం అప్పుల మీద ఆధారపడటం వల్ల పాకిస్థాన్ 23వ సారి IMF గడప తొక్కాల్సి వచ్చింది. పన్నుల వ్యవస్థను మెరుగుపరచకుండా.. రీసెర్చ్, ఆవిష్కరణలపై దృష్టి పెట్టకుండా కేవలం వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడం వల్ల పాక్ విషవలయంలో చిక్కుకుపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశీయ పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా అంతర్జాతీయ సహాయంపైనే ఆధారపడటం పాక్ భవిష్యత్తుకు ప్రమాదకరమని షెహబాజ్ షరీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక పతనాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న పాక్ లెక్కల బొక్కలు షరీఫ్ మాటలతో బయటకురావటంతో పాక్ ధీన పరిస్థితికి అక్కడి గత పాలకుల పాపాలను బయటపెడుతున్నాయని చెప్పుకోవచ్చు.
