Chiru Vs Balaiah: 'గ్యాంగ్‌స్టర్' వార్.. బాక్సాఫీస్ బరిలో మరోసారి చిరు - బాలయ్య మాస్ క్లాష్!

Chiru Vs Balaiah: 'గ్యాంగ్‌స్టర్' వార్.. బాక్సాఫీస్ బరిలో మరోసారి చిరు - బాలయ్య మాస్ క్లాష్!

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డమ్ అంటే అది మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలదే.  దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ తమ జోరును కొనసాగిస్తున్నారు.  వీరిద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే చాలు.. థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహా ఉత్కంఠ మళ్లీ మొదలైంది. వీరిద్దరూ త్వరలో 'గ్యాంగ్‌స్టర్' అవతారమెత్తి బాక్సాఫీస్ వద్ద అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి బరిలో మరోసారి ఈ మెగా-నందమూరి పోరు జరగబోతోందని ఫిలిం నగర్ సర్కిల్స్ తో టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ 'కాకా' సాబ్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య'తో మాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు బాబీ కొల్లితో మళ్ళీ చేతులు కలిపారు.

ఈ చిత్రం పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు 'కాకా' అనే టైటిల్ పరిశీలనలో ఉండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముంబయి లేదా కోల్‌కతా మాఫియా నేపథ్యంలో, ఒక సామాన్యుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందని టాక్. చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్ తో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో అలరించబోతున్నారు.

నటసింహం గ్యాంగ్‌స్టర్ గర్జన!

మరోవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ తన మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న రిలీజ్ అయిన ' అఖండ 2' అశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఈ సారి పక్కాఫ్లాన్ తో బాలయ్య అడుగులు వేస్తున్నారు.  'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన 111వ ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యారు.

ఈ చిత్రం కూడా అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. బాలయ్య పాత్ర ఎన్నడూ చూడని విధంగా చాలా రఫ్ అండ్ టఫ్‌గా, శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ మలినేని ఎలివేషన్లకు, బాలయ్య గర్జనకు తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

2027 సంక్రాంతి పోరు

గతంలో 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలు పోటీ పడి రెండూ బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలిచాయి. ఇప్పుడు 2027 సంక్రాంతికి మళ్ళీ అదే రిపీట్ కాబోతోంది. ఒకే జానర్, ఒకే సీజన్ , ఇద్దరు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లోనూ ముంబయి మాఫియా షేడ్స్ కనిపిస్తాయని వార్తలు వస్తుండటంతో, ట్రీట్ మెంట్ పరంగా ఏ దర్శకుడు కొత్తగా చూపిస్తారనే చర్చ నడుస్తోంది. ఇద్దరు హీరోలు కూడా పక్కా గ్యాంగ్‌స్టర్ లుక్స్ కోసం మేకోవర్ అవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి, 2027 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గ్యాంగ్‌స్టర్ల గర్జన వినిపించడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు.