- మొదటి నెల 5 శాతం, రెండో నెల 3 శాతం రాయితీ
- మూడో నెల చెల్లిస్తే 2 శాతమే
- 2 వేల కోట్ల వసూలే బల్దియా టార్గెట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్(ముందస్తుగా చెల్లింపులు) స్కీమ్ ను ఈసారి మూడు నెలల పాటు అందుబాటులో ఉంచనున్నట్టు సమాచారం. మూడు కార్పొరేషన్ల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి నెల(ఏప్రిల్) లో చెల్లించే వారికి 5 శాతం రాయితీ, రెండో నెల(మే) చెల్లించే వారికి 3 శాతం, మూడోనెల(జూన్)లో చెల్లించేవారికి 2శాతం రాయితీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే ఎర్లీబర్డ్ కింద ముందస్తుగా వార్షిక పన్ను చెల్లించే వారికి ఇస్తున్న రాయితీని 5 శాతం నుంచి పెంచే చాన్స్‌లు ఉన్నాయి.
ఓటీఎస్ సక్సెస్కాలే...
గతేడాది డిసెంబర్ నుంచి వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్)స్కీమ్ ద్వారా మొండి బకాయిలు రాబట్టాలని ప్లాన్ చేసినా ఆశించిన స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ రాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటీఎస్ ద్వారా గతేడాది రూ.350 కోట్లు, ఈ సారి ఇప్పటివరకు రూ.140 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎంసీ పరిధిలో రూ.112 కోట్లు, ఎంఎంసీ పరిధిలో రూ.72 కోట్లు వచ్చింది. మొత్తం కలిపితే రూ.323 కోట్లు మాత్రమే వచ్చింది. ట్రై కార్పొరేషన్లలో దాదాపు వెయ్యికోట్ల వరకు రావల్సి ఉన్నా చాలా తక్కువే వచ్చింది. దీంతో ఎర్లీబర్డ్ ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో నెల రోజులే..
గతంలో జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ స్కీమ్ ను కేవలం నెల రోజులే అమలు చేసేది. ఎర్లీబర్డ్ ద్వారా 2017-–18లో రూ.362 కోట్లు, 2018-–19లో రూ.432 కోట్లు, 2019–20లో రూ.535 కోట్లు, 2020–-21 లో రూ.572 కోట్లు, 2021-–22లో రూ.541 కోట్లు, 2022-–23లో రూ.743 కోట్ల, 2023–24లో రూ.766 కోట్లు, 2024–25 రూ.831 కోట్లు, 2025–26 లో రూ.900 కోట్లు వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు కార్పొరేషన్లలో మూడు నెలలు అమలు చేస్తే రూ. 2వేల కోట్ల వరకు వచ్చే అవకాశముంది.
