న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్టుగా వ్యవహరిస్తూ మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను సృష్టించారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గుండాగిరి, రౌడీయిజంతో పాటు పిల్లలను మత్తుకు బానిసలను చేస్తూ ఆ పార్టీ నేతలు డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించారని ఆరోపించారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్టుబడటం ఆ పార్టీ నేతలకు చెంపపెట్టు అని, ఇది వారి పాపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పులను, డ్రగ్స్ మాఫియాను అసహ్యించుకుని తెలంగాణ ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తున్నారని.. అయినా కేటీఆర్ తీరులో మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ, తమ కాంగ్రెస్ సర్కారు పారదర్శకమైన ‘ప్రజా పాలన’ అందిస్తున్నదని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
