- కాటేజీలు, టెంట్ హౌస్‌లు సిద్ధం
- నైట్ స్టే, క్యాంప్ ఫైర్, బోటింగ్, ట్రెక్కింగ్ సౌకర్యం
- రూ. 2500 నుంచి రూ.5 వేల వరకు ప్యాకేజీ రేట్లు
- అడవిలో సఫారీ, కొండలపై ట్రెక్కింగ్
వందలాది పక్షుల కిలకిలారావాలతో మేల్కొనే ఉదయం.. అరుదైన పక్షులు, వృక్షజాలం, వన్యప్రాణులతో నిండిన జీవ వైవిధ్యం.. పచ్చని తివాచీలా పరుచుకున్న పులిగుండాల అడవిలో కనకగిరి కొండల అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తున్నాయి. ఈ అందాలను దగ్గరగా ఆస్వాదించేందుకు, ఈ ప్రాంతానికి మరింత పర్యాటక శోభ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఒక వినూత్న ఎకో టూరిజం గమ్యస్థానంగా ఇది మారబోతోంది. బ్రహ్మాళకుంట ప్రాంతంలో నిర్మించిన సుందరమైన కాటేజీలు, అడవిలోనే రాత్రి బస చేసే అనుభూతి, క్యాంప్ ఫైర్ మధ్య గడిపే క్షణాలు, నీటి పై బోటింగ్, కొండల మధ్య ట్రెక్కింగ్.. ఇలా ప్రకృతి ఒడిలో అద్భుతమైన అడ్వెంచర్ ను పొందే అవకాశాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 50 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండల్లో పర్యాటక శోభను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పులిగుండాల అటవీ ప్రాంతంలో పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వందల సంఖ్యలో పక్షి జాతులు, వేలాది అరుదైన వృక్షాలు, వివిధ రకాల అటవీ జంతువులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మార్చేందుకు ఎకో టూరిజం పనులను చేపట్టారు.
ఇందులో భాగంగా బ్రహ్మాళకుంట ప్రాంతంలో కాటేజీలను అభివృద్ధి చేశారు. అటవీ ప్రాంతంలో వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి రాత్రి బస చేయడంతో పాటు క్యాంప్ ఫైర్, బోటింగ్, ట్రెక్కింగ్ అడ్వెంచర్ టూరిజాన్ని పరిచయం చేసేలా వివిధ రకాల ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్న అడ్వెంచర్ టూర్ ఆపరేటర్ కు వీటి బాధ్యతలను టెండర్ ద్వారా అప్పగించారు.
ప్రస్తుతానికి ఆఫ్ లైన్ ద్వారా ఈ కాటేజీలు, టెంట్ లను బుకింగ్ చేసే సదుపాయాన్ని కల్పించగా, త్వరలోనే ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేలా వెబ్ సైట్ ను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ కాటేజీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫారెస్ట్, హిల్స్ సఫారీ..
కనకగిరి కొండల్లో పదుల సంఖ్యలో చిరుత పులులు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, కణుజులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, అడవి పందులతో పాటు వేల రకాల పక్షులున్నాయి. అరుదైన పక్షి జాతులు కూడా ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎకో టూరిజంను ప్రోత్సహించేందుకు కొన్నేళ్లుగా దాదాపు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు.
పులిగుండాల ప్రాజెక్టు చూడడంతో పాటు, బర్డ్ వాచ్ టవర్, లెపర్డ్ వాచ్ టవర్, వ్యూ పాయింట్ కలిపి కొండల అందాలను చూసేలా దాదాపు 20 కిలోమీటర్ల సఫారీ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులను తీసుకెళ్లేందుకు, కొండలను ఎక్కేందుకు ఆల్ వీల్ డ్రైవ్ వాహనాలు, బ్యాటరీ జీప్లను సిద్ధం చేశారు. పులిగుండాల ప్రాజెక్టులో బోటింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాక్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మాళకుంట ప్రాంతంలో నైట్ స్టే చేసేందుకు రూ.20 లక్షల ఖర్చుతో దాదాపు 4 ఎకరాల్లో 2 స్విస్ టెంట్లు, 2 ఫైబర్ టెంట్లతో కాటేజీలు నిర్మించారు. 20 క్యాంపింగ్ టెంట్లు సిద్ధమయ్యాయి. వీటిలో ఏసీ, గీజర్, ఫ్యాన్, ఫ్రిడ్జ్, పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్, సోఫాలు, కుర్చీలు, కాటేజీల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
మరో రెండు కాటేజీలు సిద్ధమవుతుండగా, 20 క్యాంపింగ్ టెంట్ లను కూడా అందుబాటులో ఉంచారు. నైట్ స్టే బుక్ చేసుకున్న వారికి డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటన్నింటిలో కలిపి ఒకేసారి 50 నుంచి 60 మంది బస చేసేందుకు అవకాశం ఉంది.
కాటేజీ నుంచి బ్యూటిఫుల్ వ్యూ..
ప్రస్తుతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతుండగా, కాటేజీలను పర్యవేక్షించే బాధ్యత ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇద్దరికి క్యాంపింగ్ టెంట్ ప్యాకేజీ ఖర్చు రూ.2500 నుంచి ప్రారంభం అవుతుండగా, కాటేజీల రేట్లు మాత్రం రూ.3 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ రాత్రి బస చేస్తే కుంటల్లో నీళ్లు తాగేందుకు వచ్చే జంతువులను చూడడంతో పాటు ఉదయాన్నే వివిధ రకాల పక్షులను నేరుగా చూడొచ్చని, పక్షుల కిలకిలరావాల మధ్య ప్రకృతిని ఆస్వాదించవచ్చని ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు
