రిజిస్ట్రేషన్ఆఫీసులకు.. ఇక సొంత భవనాలు.. వారంలో స్థలాల ఎంపిక పూర్తి

రిజిస్ట్రేషన్ఆఫీసులకు.. ఇక సొంత భవనాలు.. వారంలో స్థలాల ఎంపిక పూర్తి
  • ఖమ్మం, ఇల్లందులో ల్యాండ్ కేటాయింపు పూర్తి 
  • సత్తుపల్లి, వైరా, కూసుమంచిలో రెండు స్థలాల చొప్పున పరిశీలన
  • వారం రోజుల్లోగా అన్నింటినీ ఫైనల్ చేయాలన్న 
  • మంత్రి పొంగులేటి 

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులు ఉండగా, వీటిలో సగానికి పైగా అద్దె బిల్డింగుల్లోనే కొనసాగుతున్నాయి. రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తూ నడుస్తున్న ఆఫీసులకు స్థలాలు కేటాయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వగా ఇప్పటి వరకు రెండు చోట్ల స్థల కేటాయింపు జరిగింది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్​ కార్యాలయంతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇల్లందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు స్థలాలను కూడా అప్పగించారు.

సత్తుపల్లి, వైరా, కూసుమంచిలో రెండు, మూడు చోట్ల స్థలాలను పరిశీలించగా, వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఖమ్మం రూరల్​ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను ఏదులాపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల కాంప్లెక్స్ లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్లూరులో గతంలోనే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని మొదలుపెట్టగా, దానిపై కోర్టులో ఇతరులు కేసు వేయడంతో పెండింగ్ లో ఉంది. దీంతో ప్రైవేట్ బిల్డింగ్ లోనే ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కొనసాగుతోంది. మిగిలిన భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, మధిరలో ఇప్పటికే సొంత 
భవనాలున్నాయి. 

కోట్ల ఆదాయమున్నా ప్రైవేట్ భవనాలే..!

ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఒకటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏటా రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా ఇన్నేండ్లుగా ప్రైవేట్ బిల్డింగుల్లోనే ఎక్కువ భవనాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని పాలసీ నిర్ణయించగా, రాష్ట్రంలో 48 సబ్ రిజిస్ట్రార్, మూడు జిల్లా రిజిస్ట్రార్, రెండు డీఐజీ కార్యాలయాలకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

దీంతో స్థలాల ఎంపిక త్వరగా చేయాలని ఉన్నతాధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలో కొత్త బస్టాండ్ సమీపంలోని ఎకరా స్థలాన్ని, ఇల్లందులో ఆర్అండ్ఆర్​ కాలనీ 30 గుంటల స్థలాన్ని కేటాయించారు. మిగిలిన సత్తుపల్లి, వైరా, కూసుమంచిలో రెండుకు పైగా స్థలాల చొప్పున అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిలో ఒకదాన్ని వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

నిర్మాణాలకు నిధుల కేటాయింపు..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ తో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం రూ.3.7 కోట్లు కేటాయించగా, అందులో మార్కెట్ వ్యాల్యూ అండ్​ ఆడిట్ రిజిస్ట్రార్, చిట్ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా ఉంటాయి. కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం రూ.1.75 కోట్లు, ఇల్లందు, వైరా, సత్తుపల్లి ఆఫీసుల కోసం రూ.1.40 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఆయా చోట్ల స్థలాల ఎంపికను ఫైనల్ చేస్తే వెంటనే భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులు 
భావిస్తున్నారు.

వారంలో స్థలాల ఎంపిక పూర్తి

ఖమ్మం, ఇల్లందులో రిజిస్ట్రేషన్ ఆఫీసుల కోసం స్థలాలను ఎంపిక చేశాం. కూసుమంచిలో రెండు, మూడు రోజుల్లోనే స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వైరా, సత్తుపల్లిలో కూడా స్థలాల ఎంపిక తుది దశలో ఉంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. కల్లూరులో ఆఫీస్​ నిర్మాణంపై పెండింగ్ లో ఉన్న కోర్టు కేసును వీలైనంత త్వరగా డిస్పోజ్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
- ఆడెపు శ్రీనివాస్, ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్​