- స్క్రీన్షాట్లతో పోలీసులకు భర్త ఫిర్యాదు
- జీరో ఎఫ్ఐఆర్ నమోదు.. ఖమ్మంలో ఘటన
వివరాల్లోకి వెళ్లితే..మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన భవానీతో 2016లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట ఖమ్మంకు వలస వెళ్లిన రాజేశ్వరరావు అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భవానీ స్థానికంగా ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న పూరిమొట్ల సైదులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజులుగా భవానీ ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు పిల్లలను కూడా సరిగ్గా చూసుకోకుండా హింసించడం, రాజేశ్వరరావును తరచూ వేధించడం మొదలుపెట్టింది.
దీంతో అనుమానం వచ్చిన భర్త.. ఆమె సెల్ ఫోన్ పరిశీలించాడు. అంతే అందులోనే అసలు నిజాలు బయటపడ్డాయి. తనను ఎలాగైనా చంపాలని.. ఇంట్లో చంపితే అనుమానాలు వస్తాయి కాబట్టి యాక్సిడెంట్చేసి చంపాలని భవాని తన ప్రియుడు సైదులుకు పంపిన మెసేజ్‌లు చూసి రాజేశ్వరరావు షాక్ అయ్యాడు. తనతో పాటు తన పిల్లల ప్రాణాలకు కూడా భార్య నుంచి ముప్పు ఉందని భయపడిన రాజేశ్వరరావు.. వెంటనే పిల్లలను తీసుకుని తన సొంత గ్రామానికి చేరుకున్నాడు.
భార్య, ప్రియుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లతో సహా ఈ నెల 1వ తేదీన డోర్నకల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై డోర్నకల్ సీఐ చంద్రమౌళి మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. నేరం జరిగిన ప్రాంతం ఖమ్మం పరిధిలోకి రావడంతో కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశామని, అక్కడి పోలీసులు తదుపరి విచారణ జరుపుతారని వెల్లడించారు.
