న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘జమిలి ఎన్నికల’ (వన్ నేషన్ - వన్ ఎలక్షన్) ప్రక్రియపై అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి లోక్‌సభ భారీ ఊరటనిచ్చింది. ఈ బిల్లుపై నివేదికను సమర్పించేందుకు 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు గడువును పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.
జేపీసీ గడువును పొడిగించాలని దాని చైర్మన్ పీపీ చౌదరి లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2024లను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున కమిటీకి మరికొంత సమయం కావాలని ఆయన అడిగారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ వంటి ప్రముఖులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఒకే ఓటర్ల జాబితా ఉంటుందని, దీనివల్ల దేశ సంపద, సమయం ఆదా
అవుతాయని కమిటీ అభిప్రాయపడుతున్నది.
