- మెనూ తగ్గించడంతో తగ్గిన ఆదాయం
- ఒక్క రోజు మూసేస్తే రూ.100 కోట్లు పోయినట్టే
- వేలాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం
- ఫుడ్ డెలివరీ, డెయిరీ ఉత్పత్తులు, ట్రాన్స్ పోర్టు రంగంపైనా ఎఫెక్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కమర్షియల్ గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. నగరంలోని చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు పూర్తిగా కమర్షియల్ ఎల్పీజీపై ఆధారపడ్డాయి. ఇరాన్– ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రధాన హోటల్స్, రెస్టారెంట్లలో కేవలం పార్సిల్స్మాత్రమే ఇస్తున్నారు.
ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పూర్తిగా మూసేయాల్సిన వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు. నగరంలో చిన్న టీ, టిఫిన్ సెంటర్ల నుంచి మొదలుకుంటే అన్ని రకాల రెస్టారెంట్ల వరకు దాదాపు 70 వేల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ రంగంలో కోట్ల రూపాయల ఫుడ్బిజినెస్జరుగుతోంది. గ్యాస్‌కొరత కారణంగా నగరంలో ఈ హోటళ్లు ఒక్క రోజు మూసివేస్తే సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్యాస్షార్టేజీతో ప్రతి హోటల్ మెనూ తగ్గించడంతో రూ. లక్షల్లో ఆదాయం కోల్పోతున్నాయి.
వేలాది మంది ఉపాధిపై ప్రభావం
ప్రత్యేకంగా బిర్యానీకి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో పెద్ద రెస్టారెంట్లపై ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బావర్చి, పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ లాంటి ప్రముఖ హోటళ్లలో రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి. గ్యాస్ కొరత కారణంగా వంటలు చేయడం ఆపేస్తే ఈ హోటళ్లు ఒక్కరోజే లక్షల్లో ఆదాయం కోల్పోతాయి.
ఒకవేళ మూసివేయాల్సి వస్తే యజమానులతో పాటు వేలాది మంది ఉద్యోగుల జీవనోపాధిపై ప్రభావం చూపిస్తుంది. చెఫ్‌లు, వెయిటర్లు, క్లీనింగ్, డెలివరీ సిబ్బంది రోజువారీ ఆదాయంపై ఆధారపడి బతుకుతున్నారు. గ్యాస్ కొరత ఇలాగే ఉంటే వీరి ఉపాధి కూడా దెబ్బతింటుంది.
ప్రముఖ హోటల్స్‌కు పెద్ద దెబ్బే
హైదరాబాద్‌లో పెద్ద రెస్టారెంట్ల టర్నోవర్ చాలా ఎక్కువ. రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయి. వీటి ద్వారా రోజుకు సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వస్తుంది. అలాంటి హోటల్ ఒక రోజు మూసివేస్తే అదే స్థాయిలో ఆదాయం కోల్పోతుంది. ఇలాంటి పెద్ద హోటల్స్‌కు బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. అన్ని బ్రాంచ్ లు కలిపితే రోజుకు రూ. 40 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం కోల్పోతాయి. ఇలా నగరంలోని హోటల్స్అన్నీ మూత పడితే ఈ లెక్క రూ. వంద కోట్ల వరకు చేరుతుంది.
ఫుడ్ డెలివరీ రంగం
హోటళ్లు వంట చేయలేకపోతే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు కూడా తగ్గిపోతాయి. నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంట కార్యకలాపాలు తగ్గిపోయాయి. ముఖ్యమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉండడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో జొమోటో, స్విగ్గీ, వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ ఆదాయం తగ్గింది.
సాధారణంగా ఒక డెలివరీ బాయ్రోజుకు 15–20 ఆర్డర్లు డెలివరీ చేస్తే రూ. 800 నుంచి రూ. 1,200 వరకు సంపాదన వచ్చేది. గ్యాస్ కొరత తర్వాత ఆర్డర్లు 6 నుంచి10 వరకు మాత్రమే వస్తున్నాయని, దీంతో రోజువారీ ఆదాయం రూ. 400 నుంచి రూ. 600 కే పరిమితమైందని వాపోతున్నారు. అంటే రోజుకు సగటున రూ.300 నుంచి రూ. 600 వరకు ఆదాయం తగ్గింది. దీంతో జీవనోపాధి కష్టమవుతోందని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటల్స్‌లో గ్యాస్ వినియోగం రోజువారీ నష్టం (అంచనా)
చిన్న హోటల్ / టిఫిన్ సెంటర్
రోజుకు 2–3 కమర్షియల్ సిలిండర్లు కోల్పోయే ఆదాయం: ₹10,000 – ₹30,000
మధ్యస్థ హోటల్
రోజుకు 5–8 సిలిండర్లు కోల్పోయే ఆదాయం : రూ. 50,000 – రూ. లక్ష
పెద్ద బిర్యానీ హోటల్స్
రోజుకు 10–20 సిలిండర్లు కోల్పోయే ఆదాయం : రూ. 2 నుంచి 10 లక్షలు
కూరగాయలు, మాంసం సరఫరాకు దెబ్బ
హోటళ్లకు పెద్ద మొత్తంలో కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు సరఫరా చేసే వ్యాపారులు కూడా నష్టపోతారు. హోటల్ డిమాండ్ తగ్గిపోతే రైతులు, హోల్‌సేల్ మార్కెట్లలో కూడా విక్రయాలు తగ్గే అవకాశం ఉంటుంది.
రైస్, గ్రోసరీ సరఫరాదారులు
బిర్యానీకి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో బియ్యం, మసాలాలు, నూనె వంటి సరుకులు పెద్ద ఎత్తున వినియోగిస్తారు. హోటళ్లు మూసివేస్తే ఈ సరుకుల డిమాండ్ కూడా తగ్గిపోతుంది.
డెయిరీ ఉత్పత్తుల సరఫరా
పాలు, పెరుగు, పనీర్, బటర్ వంటి పదార్థాలను హోటల్స్పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాయి. హోటల్ వ్యాపారం తగ్గితే డెయిరీ సరఫరా కూడా తగ్గుతుంది.
ట్రాన్స్ పోర్ట్ రంగం
హోటల్స్‌కు సరుకులు తీసుకెళ్లే చిన్న ట్రక్కులు, ఆటోలు, లోడింగ్ వాహనాలకు పని తగ్గిపోతుంది. దీంతో ట్రాన్స్‌పోర్ట్ రంగంపైనా ప్రభావం పడుతుంది.
ఫుడ్ ప్యాకేజింగ్
హోటళ్లలో టేక్ అవే డెలివరీ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు, కవర్లు, కార్టన్ బాక్సులు వంటి ప్యాకేజింగ్ వస్తువుల డిమాండ్ తగ్గిపోతుంది.
బొగ్గుల పొయ్యి మీద ఇరానీ చాయ్ చేస్తున్నాం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 5 వేలు వరకు పలుకుతోంది. అది కూడా కష్టం మీద వస్తోంది. అందుకే ఇరానీ చాయ్ ను బొగ్గుల పొయ్యి మీద చేస్తూ గ్యాస్ ఆదా చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధలు పడాల్సి వస్తుందో తెలియడం లేదు.
– చాయ్ కా చాస్కా, బంజారాహిల్స్ హోటల్ నిర్వాహకుడు
హోటల్ బంద్ పెట్టి.. వారం రోజులవుతోంది..
వారం రోజుల నుంచి ఒక్క సిలిండర్ దొరకడం లేదు. దీంతో హోటల్ మూసివేసే ఉంచుతున్నాం. హోటల్ లో దాదాపు అయిదుగురు పని చేస్తారు. వారందరికీ ఉపాధి పోయింది. కమర్షియల్ సిలిండర్ కావాలంటే రూ. 5 వేల నుంచి రూ. 7 వేలు అడుగుతున్నారు. అన్ని డబ్బులు ఇచ్చినా వెంటనే దొరికే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరైనా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గతంలో కిరోసిన్ తో నడిచే పొయ్యిలపై టిఫిన్లు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసి తమను ఆదుకోవాలి.
– యాదవ్, హోటల్ నిర్వాహకుడు, గుడి మల్కాపూర్
