మెల్ బోర్న్: మరో వారం రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి కమ్మిన్స్ వైదొలిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్క్యూ ఈవెంట్‌కు కమ్మిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బనేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2026, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా శనివారం (జనవరి 31) తమ తుది జట్టును ప్రకటించింది. 15 మంది పేర్లతో కూడిన టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ఆసీస్ ఇప్పటికే తమ తాత్కాలిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ కారణాలతో తాత్కాలిక జట్టులో పలు మార్పులు చేస్తూ శనివారం తుది జట్టును ప్రకటించింది.
ఈ టీమ్‌లో ప్రధానంగా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా పాట్ కమ్మిన్స్ మెగా టోర్నీకి దూరం కాగా అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేసింది. ఇక, తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌ను తప్పించి అతని స్థానంలో మాట్ రెన్షాను జట్టులోకి తీసుకుంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్:
2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి.
భారత్, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
