హిమతేజ, అభిరథ్ రెడ్డి సెంచరీలు
హైదరాబాద్ 415/4 చత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్
హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీలో తమ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న గ్రూప్–డి మ్యాచ్‌లో కె. హిమతేజ (125 బ్యాటింగ్), అభిరథ్ రెడ్డి (121) సెంచరీలతో విజృంభించడంతో రెండో రోజు, శుక్రవారం చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 415/4 స్కోరు చేసింది. ఇప్పటికే 132 రన్స్ భారీ ఆధిక్యం దక్కించుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 56/0తో ఆట కొనసాగించిన జట్టుకు ఓపెనర్లు అమన్ రావు (52), అభిరథ్ తొలి వికెట్‌కు 96 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ ఫిఫ్టీ తర్వాత అమన్ ఔటవగా.. రాహుల్ సింగ్ (39)తో రెండో వికెట్‌కు 46 రన్స్ జోడించిన అభిరథ్, హిమతేజ ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 147 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు..ఈ క్రమంలో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రాహుల్ రాదేశ్ (18) ఫెయిలైనా.. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్) ఫిఫ్టీ పూర్తి చేసుకొని హిమతేజతో కలిసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో చత్తీస్‌గఢ్ 283 రన్స్‌కు ఆలౌటైంది.
