హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్ముం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రిన్షాద్ అనే వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలతో ఆక్టివా బైక్ పై పారిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.
కేరళకు చెందిన రిన్షాద్ అనే వ్యాపారి శనివారం (జనవరి 31) ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఏటీఎమ్కు వెళ్లాడు. ఈ క్రమంలో రిన్షాద్ ను ఫాలో అయిన ఇద్దరు దుండగులు ముసుగు వేసుకుని వచ్చారు. ఏటీఎంలో డబ్బులు (రూ.6లక్షలు) డిపాజిట్ చేస్తుండగా రిన్షాద్ పై కాల్పులు జరిపి డబ్బుతో ఉన్న బ్యాగ్ ను లాక్కెళ్లి బైక్ పై పారిపోయారు.
ఈ ఘటన అక్కడున్న సీసీ కెమరాలో రికార్డ్ అయ్యింది .దుండగులు జరిపిన కాల్పుల్లో బాధితుడు రిన్షాద్ కాలులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది. ప్రస్తుం రిన్షాద్ మలక్ పేట యశోద లో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
